సగుణంగా మారే అవకాశముంది. దానికే సాద్గుణ్యమని పేరు. కాని అలాటి సాద్గుణ్యం యజ్ఞాదుల కేర్పడాలంటే అర్థం తెలిసినా తెలియకున్నా వాల్మీకి మహర్షి మరా మరా అని ఉచ్చరించినట్టు ఆ మూడక్షరాలూ ఒక మంత్రంలాగా ఉచ్ఛరిస్తూ ఆ పనులు చేస్తే చాలు. కనీసం వైగుణ్య దోషమైనా తొలగిపోతుందంటారు వ్యాసభగవానులు.
అది ఎలాగంటే చెబుతున్నారాయన. తస్మాదో మిత్యు దాహృత్యయజ్ఞ దాన తపః క్రియాః ప్రవర్తంతే - ఓం కారాన్ని జపిస్తూ యజ్ఞ దాన తపస్సులు చేస్తూ పోవచ్చు. శాస్త్రం విధించినవే గదా అవి. సతతం బ్రహ్మవాదినాం. అది ఎప్పుడూ బ్రహ్మవాదులైన పెద్దలా చరిస్తూనే ఉంటారు. సాత్త్వికమైతే మరీ మంచిది. రాజసాదులైతే దోషం తొలగిపోతుంది.
తది త్యనభి సంధాయ- ఫలం యజ్ఞతపః క్రియాః
దాన క్రియాశ్చ వివిధాః - క్రియంతే మోక్ష కాంక్షిభిః - 25
పోతే ఓంకారం గాక తత్తనే రెండవ మాటకిప్పుడు వినియోగం Application చెబుతున్నాడు మహర్షి. అనభిసంధాయ ఫలం. ఫలితం మీద దృష్టి పెట్టకుండా వదిలి తత్తని ఉచ్ఛరిస్తూ అంటే దానికే సమర్పణమని భావిస్తూ యజ్ఞ దాన క్రియా - దానక్రియాశ్చ వివిధాః క్రియంతే. దానతపః క్రియలన్నీ యధావిధిగా ఆచరిస్తూ ఉంటారట. ఎవరు. మోక్ష కాంక్షిభిః మోక్షం మీద కోరిక ఉన్న మానవులు. వారంటే మీరు కూడా అలా ఉండాలని భావం.