బుద్ధి ఏమాత్రమూ లేకుండా చేసేది. అలాటి బుద్ధితోనే చేయగలిగితే అది సాత్త్వికమని పించుకొంటుంది. అదే వర్ణిస్తున్నాడిప్పుడు. దాతవ్యమితి యద్దానం. ఇది నేను తప్పకుండా వీడి కంద జేయాలని మనః పూర్వకంగా దీయతే అనుపకారిణే. తనకు వాడు మళ్లీ ప్రత్యుపకారం చేయగలడో లేడో. దానికి తగిన సామర్థ్య మతని కున్నా లేకున్నా ప్రతిఫలం మీద దృష్టి లేకుండా చేయాలట దానమనేది.
అది కూడా ఎక్కడో గాదు. ఎప్పుడో గాదు. ఎవడంటే వాడికి గాదు. దేశే కాలేచ పాత్రేచ అన్నాడు. దేశకాల పాత్రలు యోగ్యమైనవి కావాలి. కురుక్షేత్రాదికం యోగ్యమైన దేశం. సంక్రమణాదులు యోగ్యమైన కాలం. పోతే ఏ బ్రాహ్మణుడంటే ఆ బ్రాహ్మణుడికి గాక షడంగ వేద పారంగతుడైతే అతడు యోగ్యుడైన పాత్ర. అలాటివాడు సాక్షాత్తూ విష్ణు స్వరూపుడే. విష్ణువే సాక్షాత్తూ వామన రూపంలో వచ్చి బలి చక్రవర్తిని దానమడిగి అతడా దానమిస్తే ఏమన్నాడు మహాకవి. కమల నాభు నెఱిగి కాలంబు దేశంబు నెఱిగి నాశమెఱిగి కూడా పాత్ర మనుచు నిచ్చె దానము బలి అని ప్రశంసించాడా లేదా. ఇదుగో ఇలాటి దేశకాల పాత్ర శుద్ధి తెలిసి చేసిన దానమే సాత్త్వికం స్మృతం. సాత్త్వికమైన దాన మంటారు పెద్దలు. లేకుంటే అది బూడిదలో పోసిన పన్నీరే.
యత్తు ప్రత్యుపకారార్థం - ఫలముద్దిశ్యవా పునః
దీయతేచ పరిక్లిష్టం- తద్దానం రాజసం స్మృతమ్ - 21