నాకిష్టం లేదని పక్కదారులు తొక్కి చెడిపోతానంటే అదీ కాదనదు. చెప్పవలసినదేదో మంచీ చెడ్డా రెండూ చెబుతుంది. చెడ్డ దేనికి మంచే చెప్పరాదా అంటే వీడేది తీసుకొంటాడో చూద్దామని మన వాలకం గమనిస్తుందది. మొదటనే మంచి తీసుకొంటే సంతోషిస్తుంది. అలా కాక చెడ్డనే పట్టుకొన్నాడో ఎప్పటికైనా దాని చెడు ఫలితం చవి చూచి విరక్తి చెంది ఏ జన్మకో ఒక జన్మకు జ్ఞానోదయమై వాడే మన మార్గానికి రాకపోడని దాని బరవసా. ఇదీ శాస్త్ర హృదయం. లోక హృదయం కూడా ఇదే. పారమేశ్వరమైన సృష్టిలో కూడా ఉన్నాయి గదా మంచి చెడ్డలు. మరి ఆయన ఎందుకు సృష్టించాడంటారు చెడ్డ. అది కూడా మానవుడికి వైరాగ్యాన్ని బోధించటానికే భంగ్యంతరంగా. అలా కాకుంటే సృష్టిలో ఉండగూడదు. వాఙ్మయ సృష్టిలోనూ ఉండగూడదు చెడ్డ అనేది. ఉందంటే అది మన మంచికేనని గ్రహించాలి మానవుడు. మంచి సాక్షాత్తుగా. చెడ్డ పరంపరగా. అంతే తేడా.
దాతవ్యమితి యద్ధానం- దీయతే 2 నుపకారిణే
దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్త్వికం స్మృతమ్ - 20
పోతే యజ్ఞం తపస్సు అయిన తరువాత ఇక మూడవదైన దానం విషయం చెబుతున్నాడు గీతాచార్యుడు. దానమంటే దాని అంతరార్ధమేమిటో ముందే చెప్పాను. త్యాగమే దానం. అంటే స్వార్ధ