మాటికీ హెచ్చరిస్తుంది గీత. అంతే కాదు. యుక్తః సమాధాయ అనే మాటల ద్వారా లక్ష్యం మీద దృష్టి ఉండాలని కూడా సలహా ఇస్తుంది. అంటే సాధకుడు తన జీవితాని కొక ఆదర్శం పెట్టుకొని బ్రతుకుతుండాలి. అది కేవలమైహికం కాదు. ఆముష్మికంలో కూడా కేవల ధర్మ పురుషార్ధం కాదు. పరిశేష న్యాయంగా మోక్ష పురుషార్ధం మీదనే నిలపాలి మనసు. దాన్ని సాధించటాని కిది ఒక ఆలంబనంగా చేసుకొని ముందుకు సాగిపోవాలని మహర్షి తాత్పర్యం. అలా కాకుంటే అఫలా కాంక్షిభిర్యుక్త్రః అని తరుచు మనలను హెచ్చరించడు.
సత్కార మాన పూజార్ధం - తపో దంభేన చైవయత్
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చల మధ్రువమ్ - 18
అయింది. సాత్త్వికం దాటి రాజసం దగ్గరికి వచ్చేసరికే ధోరణి మారిపోయింది. సాత్త్వికం వరకూ ఏదైనా మంచిదే. మానవుడి కది శ్రేయో దాయకం. యజ్ఞం దానం తపస్సని చూడనక్కర లేదు. తపస్సులో కూడా శారీరం వాచికం మానసమని కూడా అనుకోనక్కర లేదు. ఎందులో ఏదోషమూ లేదు. అన్నీ గుణవంతమే. వెంటనే కాకపోయినా క్రమేణా మనలను గమ్యం చేర్చేవే. ఎటు వచ్చీ సాత్త్విక స్థాయి దిగి క్రిందికి దిగజారితేనే ప్రమాదం. అదే వర్ణిస్తున్నాడిప్పుడు. సత్కార మాన పూజార్ధం - నాకీ తపస్సు చేస్తే పదిమందీ ఆహా ఎంత గొప్ప తపస్వి