దేవతలనూ బ్రాహ్మణులనూ అందులోనూ ప్రజ్ఞావంతులైన వారినీ పోతే మంత్రోపదేష్టలైన గురువులనూ వీరందరినీ సత్కార పాద పూజాదులతో గౌరవించాలి. తమ కంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు వీరంతా. స్వర్గవాసులైనా భూవాసులైనా అతీతమైన శక్తులున్న వారు. అలాంటి వారిని శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తే తమకూ అందులో కొంత సంక్రమించే అవకాశ ముంటుంది. అది గమనించి నడుచుకోవాలి మానవుడు.
రెండవది శౌచం. ఆంతర్యంలో బాహ్యంలో పరిశుద్ధుడయి ఉండాలి ప్రతివాడూ. బాహ్యాభ్యంతర శ్శుచిః అన్నారు. శుచిత్వం లేకపోతే ఏ మంచి పని చేసినా అది ఫలించదు. మూడవది ఆర్జవం. అంటే ఋజు స్వభావం. నిజాయితీగా ప్రవర్తించటం. ఆలోచించేదొకటి చెప్పేదొకటీ చేసేదొకటీ కాగూడదు. నాలుగు బ్రాహ్మచర్యం. నిత్యమూ పాటించాలది. స్వదారాభిరతి పరదార పరాజ్ముఖిత్యమూ లేని వాడు పశువుతో సమానం. అది పశువులకేమో గాని మానవుడికి శరీరేంద్రియ జ్ఞాన శక్తి క్షయానికి దారి తీసి మానవుణ్ణి నిర్వీర్యుణ్ణి చేస్తుంది. కనుక తప్పక పాటించ వలసిన గుణమిది. పోతే అయిదవది అహింస. ఏ ప్రాణినీ ఎప్పుడూ హింసించ గూడదు. ఆత్మౌ పమ్యేన అన్నట్టు దాని స్థానంలో తానే ఉంటే ఎలా బాధ పడతాడో ఊహించుకొని హింసను పరిత్యజించాలి మానవుడు. లేకుంటే ఒక క్రూర మృగానికీ తనకూ తేడా ఏముంది. ఇదుగో ఇలాటి సత్ప్రవర్తన