దానం వీటి రెండింటిలో కేవలం సాత్త్విక రాజస తామసాలనే మూడు విధాలే చెప్పి ఇక్కడ తపస్సనే దానిలో మాత్రమే మరొక మూడు అదనంగా పేర్కొనటంలో ఏమిటి ఆంతర్యమని ఆశంక రావచ్చు మనకు.
కాని ఒక్క విషయ మాలోచించాలి మనం. దానమూ యజ్ఞమూ ఇవి రెండూ వాక్కుకూ శరీరానికీ సంబంధించినవని చెప్పాము. తపస్సనేది అలా కాక మనస్సుకు చెందిన లక్షణం. అయితే మనస్సులో సంకల్పం. కలగకుండా అవి కూడా ఆచరించటం సాధ్యం కాదు. అందుకే వాటిని వర్ణించేటపుడు మనస్సును స్మరించకుండాపోడు మహర్షి. అయినప్పటికీ తపస్సు కున్న ప్రాధాన్యం వాటికి లేదు. తపించటమే తపస్సు. అది కాయిక వాచికాల భూమికలో ఉన్నా మనోభూమికకు చెందినదే. సర్వోత్కృష్టమైనది. ఎప్పటికైనా పరమ పదాన్ని అందుకోటానికి సాధనం మనస్సే గాని మరేదీ కాదు. మనసై వేద మాప్తవ్యమని గదా శ్రుతి ఘోషిస్తున్నది. దానికి తీసికట్టే వాక్కాయ సాధనాలు రెండూ.
అంచేత మనస్సు కున్న ప్రాధాన్యాన్ని మనసులో పెట్టుకొనే వ్యాస భగవానుడు దాన్ని మూడు భూమికలలో గాక ఆరు భూమికలలో రెండింతలు చేసి మనకే కరువు పెడుతున్నాడా అనిపిస్తుంది. అందులో మొదటి భూమికాత్రయంలో శారీరమైన తపస్సును పేర్కొంటున్నాడు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజన మనేది శారీరమైన తపస్సులో మొదటి లక్షణం.