స్థాయి నుంచి పైకి పోకుండా అక్కడికక్కడే ఆపి వేస్తాయి. అలాటి పరిచ్ఛిన్నమైన దృష్టికి పరిపూర్ణమైన భగవత్తత్త్వాన్ని గూర్చిన అవగాహన ఎలా ఉదయిస్తుంది. ఉదయించక పోతే దానికి వ్యాపకత్వమూ లేదు. శాశ్వతమైన శ్రేయస్సూ లేదు. ఇజ్యతే. ఏదో చేస్తున్నాడని పేరే గాని తం యజ్ఞం విద్ధి రాజసం - అది రాజసమైనదే ఆయజ్ఞమని హెచ్చరిస్తున్నాడు గీతాచార్యుడు.
విధి హీన మసృష్టాన్నం - మంత్ర హీన మదక్షిణమ్
శ్రద్ధా విరహితం యజ్ఞం తామ సంపరి చక్షతే - 13
కాగా ఇక తామసమైన యజ్ఞమెలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. తమోగుణంతో చేసేదెలా ఉంటుంది కాకపోయినా. రజస్సైనా కొంచెం మేలు. అది సాత్త్వికం కాకున్నా తామసం లాగా మరీ నికృష్టం కాదు. ఇది ఎంత నికృష్టమో అంత నికృష్టమైనది. విధి హీనం. - విధి అంటే శాస్త్ర విధానం. శాస్త్రం చెప్పినట్టు చేయకపోగా దానికి భిన్నమైన మార్గంలో ఆచరించే యజ్ఞమిది. అందుకే అసృష్టాన్నం. బ్రాహ్మణులు మొదలైన పెద్దలెంతో మంది వస్తే వారి కన్నం పెట్టే యోగ్యత కూడా లేదు. అన్నదానం కూడా లేని యజ్ఞమేమి యజ్ఞమది. పోనీ మంత్రమైనా చక్కగా చదివే ఋత్విక్కులున్నారా అంటే అదీ లేదు. మంత్రహీనం. మంత్ర హీనం స్వరతో వర్ణతో వా వి యుక్తమని వ్రాస్తున్నారు భాష్యకారులు. ఉదాత్తాను