#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

  పోతే ఇక తామసు లిష్టపడే ఆహార మెలాంటిదో వర్ణిస్తున్నది గీత. యాత యామం. మందపక్వమని అర్థం. అంటే బాగా ఉడకని పదార్ధం. గత రసం – ఏ మాత్రమూ సారం లేనిది. ఎండిపోయినది. శుష్కమయినది. పక్వం కాని పక్వమైనా వరిటిపోయిన పదార్థం తింటే ఏమయినా ఉందా. ఒకటి జీర్ణం కాదు. మరొకటి అసలు ఒంటికి బలమే ఇవ్వదు. పూతి. అంటే దుర్గంధి. చెడ్డ వాసన వచ్చే పదార్థం. అసలే పనికిరానిది. శక్తి నివ్వక పోవటమలా ఉంచి హానికరం శరీరానికి. పర్యుషితం. పక్వం సత్ రాత్ర్యం తరితమని వ్రాస్తున్నారు భాష్యకారులు. బాగా పక్వమయిన పదార్ధమే ఒక రాత్రి గడచిన తరువాత ఉపయోగించేది. చద్ది పదార్ధమన్న మాట. అదీ పనికిరాదట. అయినా మనవాళ్లదే పనిగా దాచుకొని తింటుంటారు చూచారో లేదో. ఈ రోజుల్లో ఇది మరో అవతారం కూడా ధరించి కనిపిస్తున్నది. అమెరికా లాంటి విదేశాలలో వండిన పదార్ధాలు ఫ్రిజ్జులో పెట్టి కొన్నాళ్లు పోయిన తరువాత స్వీకరిస్తుంటారు. నెలల తరబడి నిలవ చేసి తినేవాళ్లు కూడా ఉన్నారు. చూస్తున్నాము. బద్ధకించో బహువ్యాపకాలతో తీరిక లేకో ఇలాటి కక్కుర్తికి గురవుతున్నారు మానవులు. పైగా ఇది చాలా నాగరికత అని కూడా మూర్ఛపోతుంటారు. కాని ఇది Slow Poi- son లాగా శరీరాన్ని చివరకెంత కుంగదీస్తుందో వీరి కర్ధం కాదు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు