చేసుకోవాలి మనం. కాగా ఇటు శాకాహారం గాని అటు మాంసాహారం గాని అతి మాత్రమైతే ప్రమాదమే. మాంసాహార మతి మాత్రం కాకున్నా ఎప్పుడూ ప్రమాదమే.
కాని ఇలాంటి ఆహారమే సేవిస్తారు రాజస స్వభావమున్న మానవులు. రాజస స్యేష్టాః ఎంత ఇష్టమైనా సేవిస్తున్నప్పుడు బాగా ఇంపితంగా ఉన్నట్టు కనిపిస్తుందే గాని పర్యవసానంలో అది ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. దుఃఖ శోకామయ ప్రదాః ఆమయమంటే అనారోగ్యం. అనేకరకాలైన వ్యాధులు. అవి సంక్రమిస్తాయి శరీరంలో. దానితో శరీరం డొల్ల అయిపోతుంది. అంతేకాదు. వ్యాధులే గాక ఆధులు కూడా సంభవిస్తాయి. దుఃఖ శోకాలంటే అవే. వ్యాధులు శరీరానికి కలిగేవైతే ఆధులు మనస్సుకు సంభవించేవి. ఆధి వ్యాధులన్నారు పెద్దలు. మనస్సూ శరీరమూ రెండూ దెబ్బ తింటే ఇక మనమెక్కడున్నాము. రెండే గదా జ్ఞాన సాధనకు పనికి వచ్చే పరికరాలు. ఇవి పనిచేయకుంటే ఇక జ్ఞానమేముంది. దాన్ని సాధించటమేముంది. జ్ఞానం దేవుడెరుగు. సుఖశాంతులు కూడా కరువయి పోతాయి జీవితానికి.
యాత యామం గతరసం పూతి పర్యుషితంచ యత్
ఉచ్ఛిష్ట మపి చా మేధ్యం- భోజనం తామస ప్రియమ్ - 10