ఇరవయి నాలుగు తత్త్వాలలోనే చేరిపోయి దాన్ని కూడా క్షేత్రంగానే పరిగణించవలసి ఉంటుందని వ్యాస హృదయం.
పోతే ఇక ఇచ్ఛా ద్వేషాదులు. ఇవి ఆత్మగుణాలని చెబుతారు వైశేషికులు. కాదు. ఆత్మ గుణాలైతే క్షేత్రజ్ఞుడి పక్షంలో చేరతాయి. అలా చేరటానికి వీలుపడదు. కారణం. క్షేత్రజ్ఞుడంటే కేవల జ్ఞాన స్వరూపుడు. అది గుణాతీతమైన తత్త్వమే గాని గుణాన్వితం కానేరదు. కాబట్టి వీటిని ఆత్మగుణాలని పేర్కొనటం తప్పు - అయితే దేనివీ గుణాలు. బుద్ధి గుణాలని అద్వైతుల జవాబు. బుద్ధి గుణాత్మకం. బుద్ధికి సంబంధించిన దాత్మకు ఆరోపిస్తున్నాము. అంచేత ఇంతకూ సాంఖ్య వైశేషికులు చెప్పే ఆత్మకు విలక్షణమైనది వేదాంతులు వర్ణించే ఆత్మ. వారు చెప్పేది కర్తభోక్తృ స్వరూపమైతే వేదాంతులు చెప్పేది దాని కతీతమైన సాక్షిరూపమైన ఆత్మ. ఇదీ ఇక్కడ మనం గుర్తించవలసిన రహస్యం.
ఇచ్ఛా ద్వేషాదుల లక్షణం చెబుతున్నాడు మహర్షి. ఇచ్ఛ అంటే ఇంతకు ముందు ఏది మనకు సుఖప్రదమని గుర్తించామో అదే మరలా కోరటం. ద్వేషమంటే ఏది దుఃఖదాయకమని గ్రహించామో అది మరలా ప్రాప్తించ గూడదని త్రోసి పుచ్చటం. ఇవి రెండూ అంతఃకరణ ధర్మాలే కాబట్టి క్షేత్రం క్రిందికే వస్తాయి. అలాగే సుఖం దుఃఖం. ఒకటి అనుకూలం వేరొకటి మనకు ప్రతికూలమనే భావం. ఇదీ క్షేత్రమే. సంఘాతః చేతనా ధృతిః సంఘాతమంటే దేవేంద్రియాది సమూహం. పోతే అందులో అభివ్యక్తమయ్యే అంతఃకరణ వృత్తి చేతన. ఆత్మ చైతన్యాభాసతో కూడినది కాబట్టి అది