పోతే ఇక ఇంద్రియాణి దశ ఏకంచ. పది ఇంద్రియాలు. త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణాలనే అయిదు జ్ఞానేంద్రియాలూ. వాక్పాణి పాద పాయూపస్థలనే అయిదు కర్మేంద్రియాలూ కలిసి పది. వాటికి తోడు వాటి అధిపతి మనస్సు. మొత్తం పదకొండు ఇంద్రియాలు. పంచ చ ఇంద్రియ గోచరాః పంచ జ్ఞానేంద్రియాలకూ గోచరించే శబ్ద స్పర్శాది విషయా లయిదు. పదకొండు అయిదు మొత్తం పదహారు. ఇంతకు ముందు పేర్కొన్న ఎనిమిది ఇవి పదహారూ రెండు వరసలూ కలిసి మొత్తం ఇరవయి నాలుగు తత్త్వాలవుతాయి. వీటినే సాంఖ్యమతస్థులు చతుర్వింశతి తత్త్వాలుగా వర్ణిస్తారు. సాంఖ్యులకు చతుర్వింశతి తత్త్వాలు ప్రధానమనే ప్రకృతి గుణాలైతే పంచవింశః పురుషః - ఇరువది అయిదవ తత్త్వమొకటి ఉంది. దానికి పురుషుడని పేరు పెడతారు వారు. ఇవి త్రిగుణాత్మకమైతే వాడు నిర్గుణమైన తత్త్వం. అయినా ఈ గుణాల సంపర్కం వల్ల శరీరంలో వచ్చిపడి అనేక శరీరాలలో అనేక విధాలుగా మారి ప్రకృతి వల్ల కలిగే కష్ట సుఖాలను భవిస్తుంటాడని వారు చెప్పే మాట. అలాంటప్పుడు నిర్గుణుడు అసంగుడని చెప్పి కూడా సుఖమేమిటి. పైగా నిర్గుణుడైతే సర్వ క్షేత్రాలూ వ్యాపించక ఒకే క్షేత్రంలో ఎలా బందీ అవుతాడు. అలా బందీ అవుతాడు గనుకనే ఒక్కొక్కక్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడని అనేకమంది పురుషుల నొప్పుకోవలసి వచ్చింది సాంఖ్యులు. ఇది సర్వక్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుడొక్కడేనని చెప్పే భగవద్గీత సిద్ధాంతానికి విరుద్ధం. అప్పటికి సాంఖ్యులు క్షేత్రజ్ఞుణ్ణి అసంగుడని వేరు చేసి ఇరవయి అయిదవ తత్త్వంగా వర్ణించినా వేరు కాజాలదది.