సాత్త్వికం సేవిద్దామనే వారెక్కడో గాని లేరు లోకులలో. బాహుళ్యం మీద అందరూ రాజసతామస భావాల వెంటబడి పోయేవారే. అది వారి కిష్టమయి కావచ్చు. లేక సాత్త్వికమైనది చాలా కష్టమనీ కావచ్చు. అలా కాక ఏది ఎలాంటిదో ఏది తమకు హితమో ఏది కాదో విమర్శించి చూచే జ్ఞానం లేకా కావచ్చు. కాబట్టి తేషాం భేద మిమం శృణు. వాటి స్వరూపమేమిటో వేరు వేరుగా వర్ణించి చెబుతాము వినమంటున్నది గీత.
ఆయుస్సత్త్వ బలా రోగ్య- సుఖ ప్రీతి వివర్ధనాః
రస్యాః స్నిగ్ధాః - స్థిరా హృద్యా - ఆహార స్సాత్త్విక ప్రియః -8
ముందు సాత్త్వికమైన ఆహార మెలాంటిదో వర్ణిస్తున్నాడు మహర్షి అభ్యర్హతం ప్రధమ మన్నారు. ఏది మన కుపాదేయమో మంచిదో అది మొదట పేర్కొనటం న్యాయం. సాత్త్వికమేగా మనకు కావలసింది. అందుకే మొదట సాత్త్వికాన్నే పేర్కొంటున్నాడు. ఇలాగే తతిమా వాటిని చెప్పేటప్పుడు కూడా సాత్త్వికమే మొదట నిర్దేశించటం జరుగుతుంది.
అయితే ఎలాంటిది సాత్త్వికమైన ఆహారం. ఏదైతే మానవుడి కాయుర్దాయాన్ని పెంచుతుందో బుద్ధి నైర్మల్యాన్ని ప్రసాదిస్తుందో శారీరకమైన బలాన్ని ఆరోగ్యాన్ని మానసికమైన సుఖాన్ని ప్రీతిని పెంపొందిస్తుందో అదీ సాత్త్వికమైన ఆహారం. అది మనకు చేసే ప్రయోజనం చెప్పాడే గాని అసలది ఎలా ఉండాలో దాని స్వరూపం చెప్పలేదు. అది