#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

ఆవృత్తి చేసుకొంటూ ఉండటమైతే దానికి విజాతీయమైన ప్రాపంచిక వృత్తులన్నింటినీ పరిత్యజించటం దానం. ధియో యోనః ప్రచోదయా త్తనిగదా మంత్రం. వరేణ్యమైన భర్గస్సు లేదా బ్రహ్మవృత్తి నెప్పుడూ మనసులో నిలుపుకొన్నామో అప్పుడిక మిగతా వృత్తు లేవీ అక్కడ ఉండటానికి లేదు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అంచేత వాటిని వదులుకొన్నామని వాగ్దానం చేయాలి సాధకుడు. అప్పటికి తపస్సు మానసికమైతే దానం వాచికమయింది. పోతే యజ్ఞమనేది కాయికం. ఎలాగంటే మనస్సులో కలిగిన బ్రహ్మ వృత్తి వాక్కులో తదన్య వృత్తులన్నీ పరిత్యజించటానికి దారితీస్తే ఏకైకమైన బ్రహ్మ దృష్టినే అవలంబించి ఆ దృష్టితోనే మానవుడు తన బాహ్యమైన జీవితం జీవిస్తూ పోతే అది నిజంగా ఒక యజ్ఞమే. యజ్ఞమంటే జ్యోతిష్టోమాది కామ్యకర్మలు కావని ముందే చెప్పాము. జ్ఞానయజ్ఞమే అసలైన యజ్ఞమని భగవద్గీత మొదటి నుంచీ మనలను హెచ్చరిస్తూనే ఉంది. యజ్ఞార్థా త్కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః - యజ్ఞమంటే ఈశ్వరుడని అర్థం చెప్పారు భాష్యకారులు. ఈశ్వర భావనతో చేసే ప్రతి పనీ పవిత్రమే. అది నీకు బంధకం కాదు. మోచకం అలాంటి దృష్టి లేక కేవలం యాంత్రికంగా చేస్తే మాత్రమది నిన్ను బంధిస్తుందని తాత్పర్యం. అంచేత జ్ఞాని అయిన వాడి జీవితమే ఒక మహా యజ్ఞం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు