నాలుగింటిలో మొదట ఆహారాన్ని వర్ణిస్తాడు మహర్షి ఆ తరువాత యజ్ఞదాన తపస్సులను వరుసగా నిరూపిస్తూ పోతాడు. కాని మన విచారణ తపస్సుతో ప్రారంభం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే తపస్సనేది మానసికం. దానం వాచికం. యజ్ఞమనేది కాయికం. మనోవాక్కాయాలే మనకున్న కరణాలు. కరణమంటే ఉపకరణం లేదా సాధనం. ఇటు ఐహికమైనా అటు ఆముష్మికమైనా మానవుడే పురుషార్ధాన్ని సాధించాలన్నా ఈ త్రికరణాలే మన దగ్గర ఉన్నవి. వీటి నాధారం చేసుకొనే అప్పటి కర్థం చెప్పవలసి ఉందా మూడు మాటలకూ మనం. అది కొంత మంది వాచ్యార్థమే చెప్పి ముగిస్తే కొందరు వాచ్యార్థంతో పాటు లక్ష్యార్థం కూడా చెబుతారు. లక్ష్యాన్ని బట్టి చెప్పాలే లక్షణమైనా. లక్ష్యమేమి టిక్కడ. బ్రహ్మజ్ఞానం. అది ఈ యజ్ఞాదుల వల్ల కలుగుతుందని ఎప్పుడన్నదో శాస్త్ర మప్పుడా జ్ఞానానికి సాధనాలుగానే వీటిని సమన్వయించి చూపటం మన కర్తవ్యం.
అది భగవత్పాదులు చాలా వరకు సూచన చేశారు. కాని ఈనాటి వారికది అంత స్పష్టంగా మనసుకు రాకపోవచ్చు. కాబట్టి దాన్ని బాగా వివరించవలసి ఉంది మనం. తపస్సంటే బాహ్యమైన చాంద్రాయణాదులు కావని ఆయనే అన్నారు. ఏమిటిక తపస్సంటే. మనసులో కలిగే ఆలోచనే తపస్సని గదా చెప్పాము. మరి దానమేమిటి. దానం చేయటం త్యాగం చేయటం. వదులుకోటం తపస్సు బ్రహ్మాకార వృత్తి నెప్పుడూ మనసులో