#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

అలాగే దానమనేది కూడా పాపక్షయ హేతువూ ధర్మవృద్ధి హేతువూ గనుక జ్ఞానోత్పత్తి కవకాశమిస్తుంది. పోతే తపస్సు కూడా. తపస్సంటే కృచ్ఛ చాంద్రాయణాదులే గావు. అనాశకమనే మాట వాడారక్కడ. అశనం లేకుండా తపస్సు నీవవలంబిచా లట. అశనం లేకపోవటమంటే భోజన నివృత్తి కాదు మరలా. భోజనం మానేస్తే చచ్చి కూచుంటాడు మానవుడు. అంతే గాని ఆత్మ సంవేదన కాదది. కామాన శనమే ఇక్కడ అనాశకమనే మాట కర్థం. కామ్యకర్మలు వదిలేసి ఆత్మను గూర్చి ధ్యానం చేయటమే అది ఇలా ఇవి మూడూ పాటిస్తూ పోతే ఆత్మ జ్ఞానోత్పత్తి ద్వారేణ మోక్షసాధన త్వం ప్రతిపద్యతే. ఆత్మ జ్ఞానానికీ తద్వారా మోక్షానికీ ఉపకరిస్తాయి అని చెప్పి ఆయన ఇంకా ఒక బంగారం లాంటి మాట కూడా అన్నారక్కడ. ఏవం కర్మ కాండేనాస్య ఏకవాక్యతా వగతిః యజ్ఞాదులు కూడా మనస్సును శుద్ధి చేసి జ్ఞానానికి దోహదం చేస్తున్నాయి కాబట్టి కర్మజ్ఞాన కాండలకు రెండింటికీ ఉన్న ఏకవాక్యత Agreement అంటే సమన్వయం Synthesis చక్కగా మనకవగత మవుతున్నదని గొప్పగా చాటి చెప్పారాయన పండిత పామర లోకానికంతటికీ. ఇలా

  ఈ శాంకర భాష్య శ్రవణ బలంతో మనమిప్పుడు మన ధోరణిలో విచారణ చేసి చూతా మీ మూడింటినీ. ఈ మూడే గాక వీటి కాహారమనేది ఎలా తోడ్పడుతుందో ఆ నాలుగవ దాన్ని కూడా భేదించి పట్టుకోవచ్చు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు