ఎలా ఉపయోగపడుతుందో అదే చెప్పాలి మనకు మహర్షి. అది వదిలేసి యజ్ఞాదులనూ ఆహారాదులనూ వర్ణిస్తూ పోవటంలో ఆయన ఉద్దేశమేమయి ఉంటుందనే మనమిక్కడ విచారణ చేయవలసిన ముఖ్యమైన అంశం.
ఈ యజ్ఞ దాన తపస్సులనేవి ఇక్కడే గాదు. భగవద్గీత 18 అధ్యాయంలో కూడా ప్రస్తావిస్తుంది. యజ్ఞోదానం తపశ్చెవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపస్సులనేవి మూడూ వివేక వంతుడైన మానవుడికి పరిశుద్ధినీ పవిత్రతనూ ప్రసాదిస్తాయని ఉన్నదక్కడ. అంతేకాదు. అసలు ఉపనిషత్తులే వర్ణించాయీ మూడింటినీ ఎంతో గొప్పగా. తమేతం వేదాను వచనేన బ్రాహ్మణా విదిదిషంతి - యజ్ఞేన దానేన తపసా 2 నాశకేన అని బృహదారణ్యకం చెప్పే మాట. అక్కడ భగవత్పాదులు దాన్ని వ్యాఖ్యానిస్తూ గీతాప్యువాచ. గీతలో కూడా ఇదే ప్రస్తావించారంటాడు. ఇంతకూ ఈ మూడింటినీ పట్టుకోటంలో ఉపనిషత్తు వివక్షిత మేమిటి. తమేతం వివిదిషంతి. ఆత్మ స్వరూపమేమిటో దాన్ని యధాతధంగా అర్థం చేసుకొని అనుభవానికి తెచ్చుకోటాని కెంతైనా తోడ్పడుతాయట. ఎలా తోడ్పతాయని అడిగితే భగవత్పాదులాయ న ధోరణిలో ఆయన ఇలా వివరించారు.
ద్రవ్యయజ్ఞాలు క్రియాయజ్ఞాలు జ్ఞాన యజ్ఞాలని చాలా ఉన్నాయి యజ్ఞాలనేవి. అందులో జ్ఞాన యజ్ఞమనేది ప్రధానం. దాని మూలంగా మానవుడి సత్త్వం విశుద్ధమై ఆత్మ జ్ఞానమనేది నిర్విఘ్నంగా ఉదయిస్తుంది.