#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

పట్టుకొంటాడు. అది కూడా శుద్ధి చెందితే ఆ సత్త్వం - దానివల్ల ఆత్మ జ్ఞానమే ఉదయించి పరా దేవత అయిన పరమాత్మనే సర్వత్రా దర్శిస్తారు. అయితే అలాటి గొప్ప ఆదర్శాన్ని అందరూ అందుకోలేరు. బాహుళ్యేన తు రజోనిష్ఠా స్తమో నిష్ఠా శ్చైవ ప్రాణినో భవంతి. తరుచుగా ఈ మానవులు రాజస తామస భావాలతోనే బ్రతుకుతుంటారని బాధ పడుతున్నారాయన.

అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యే తపో జనాః
దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః -5

  అలాటి వారి వ్యవహారమెలా ఉంటుందో చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తున్నది గీత. మొదట వారు చేసే తపస్సును వర్ణిస్తుంది. తపస్సంటే తపించటం. తపన చెందటం. మనసులో సంకల్పించటం. ఇలా చేస్తే బాగుంటుందలా చేస్తే బాగుంటుందని ఆలోచించటం. ఏదైనా ఆలోచిస్తేనే ఒక పని చేస్తాడు మానవుడు. మొదట సంకల్పం తరువాత మాటా ఆ తరువాత క్రియా. ఇదీ వరస. వీటికే త్రికరణాలని పేరు. ఒక్క బాహ్యమైన చేట్టే గాదు. ఆలోచనా మాటా కూడా క్రియలే. మూడింటిలో మొదటిది ఆలోచనే. అదే తపస్సంటే. యస్య జ్ఞానమయం. తపః జ్ఞానమే తపస్సన్నది ఉపనిషత్తు. ఆ ఈశ్వరుడు కూడా మొదట సృష్టికి పూర్వం ఆలోచించే తరువాత దానికనుగుణంగా ఈ ప్రపంచాన్ని సృష్టించాడట. స తపోతప్యత. స తపస్తప్త్వా ఇదగ్ం సర్వ మసృజత అని స్పష్టంగా చెబుతున్నది శాస్త్రం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు