జీవిత గమ్యమేమిటో వారికే మాత్రమూ అంతుపట్టినట్టు కనిపించదు. పైగా అది కూడా బ్రహ్మ భావానికి తోడ్పడేదే నని వేదాంత జ్ఞానం కేవలం సిద్ధాంతమే అది మాత్రమే మనకు ఫలితమివ్వదు దానినిలా అనుష్ఠించినప్పుడే అది మోక్షానికి దారి చూపుతుందని పెడసరంగా వాదిస్తుంటారు. శైవాగమాలూ వైష్ణవాగమాలూ - శ్రీవిద్యాదులూ అన్నీ ఇలాంటి అపమార్గాలే. స్వయం మూఢః అన్యాంశ్చ వ్యామోహయతి అని భగవత్పాదులు చెప్పినట్టు తాము దారి తప్పి అందరినీ ఆ దారికే తిప్పటానికి ప్రయత్నిస్తుంటారు వీరు. వైదికమైన అద్వైత దృష్టి వీరికే మాత్రమూ అలవడ లేదు. అద్వైతంలో జ్ఞానమే తప్ప దానికి వేరుగా అనుష్ఠానం లేదు. జ్ఞానా దేవతు కైవల్యమ్. జ్ఞానమే అనుష్ఠానం. అదే నిదిధ్యాసన. విజాతీయంగా ఏభావం మనసుకు వచ్చినా సజాతీయమైన బ్రహ్మ భావనలో కలిపేసుకొని అంతా బ్రహ్మమయంగా చూస్తూపోవటం. అంతా బ్రహ్మమయ మన్నప్పుడిక ఆ స్థితిలో మంత్రమేమిటి తంత్రమేమిటి జపమేమిటి తపమేమిటి అనుష్ఠానమేమిటి ఆరాధనమేమిటి. అలా అంటున్నారంటే మరలా ఆ స్థితిలో నుంచి పక్కకు తొలగుతున్నావు.
అందుకే వ్రాస్తున్నారు భగవత్పాదులు కశ్చి దేవ సహస్రేషు దేవ పూజాది పరస్సత్త్వ నిషో భవతి. ఎవడో నూటికి కోటి కొకడుంటాడు. సత్త్వనిష్టాపరుడు. వాడు క్షుద్ర దేవతలను గాక శివవిష్ణ్వాదులనే