#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

ప్రవర్తనే మనకు లింగమంటారు భాష్యకారులు. లింగమంటే నిదర్శనం Indication. మానవుల సంకల్పం అంతర్గతంగా ఉన్నా వారి మాటలూ చేష్టలూ బయటపడి కనిపిస్తుంటాయి. కాబట్టి వీటిని బట్టి వారికెలాటి శ్రద్ధా నిష్ఠా ఉన్నదో పోల్చుకోవచ్చు నంటాడు మహర్షి

  అది ఎలాగంటే వివరిస్తున్నాడు. యజంతే సాత్త్వికా దేవాన్. సాత్త్వికమైన శ్రద్ధ ఉన్న వారి సంగతే వేరు. వారెప్పుడూ సాత్త్వికమైన భావాలతో ఉంటారు. దానికి తగినట్టు వారు శివవిష్ణ్వాది దేవతలనే పూజిస్తుంటారు. వారి స్త్రోత్రాలే చదువుతూ వారి రూపాలే మనసులో భావిస్తుంటారు. పోతే యక్షరక్షాంసి రాజసాః - రజోగుణాత్మకమైన శ్రద్ధ ఉన్నవారు యక్షులనూ రక్షస్సులనూ ఆరాధిస్తుంటారు. వారికి వెంటనే కావాలి సిద్ధి. దానికి తోడ్పడేవి ఆయా క్షుద్ర దేవతలు. వారి కామ్యకర్మలకు తగినట్టవి వారి కోరికలు తీరుస్తుంటాయి. పోతే అంతకన్నా క్షుద్రశక్తులను పూజిస్తుంటారు తామసులైన జనులు. ఎవరా దుష్ట శక్తులు. ప్రేతాన్ భూతగణాన్. సప్తమాతృకాదీ నని అర్థం వ్రాస్తున్నారు భాష్యకారులు. ఛిన్నమస్తకా చతుర్భగినీ ఇత్యాదులు.

  ఇలా బాహ్యమైన వారి పూజా విధానాన్ని బట్టి మన మర్ధం చేసుకోవచ్చు వారి నిష్ఠ ఎలాంటిదో. సాధారణంగా ఈ మంత్ర తంత్రాది విద్యలలో పడి మునిగిపోతే వారందరూ ఇంతే. క్షుద్ర విద్యోపాసకులు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు