చర్మమూ కండలూ గావట. ఒక మానవుణ్ణి తూకం వేస్తే తూగేది వాడి శరీరం కాదు. వాడి జ్ఞానం - జ్ఞానం నరాణా మధికోవిశేషః జ్ఞానేన హీనః పశుభి స్స మానః ఒక్క జ్ఞానమే మానవుడి విశిష్టత. అది లేదో వాడు మానవుడే కాడు. పశుప్రాయుడే. ఇక్కడ సూఫీ లింకా చక్కగా చెప్పారు. అల్లా ఈ జీవులను సృష్టించాడంటే నిష్ప్రయోజనంగా సృష్టించ లేదు. సర్వజ్ఞుడైన అల్లా ప్రయోజనం లేకుండా ఎలా సృష్టిస్తాడు. ఒక్కొక్క జాతిని సృష్టించేటపు డొక్కొక్క గుణం దానికదనంగా ఇచ్చి సృష్టిస్తాడు. కారణం - దానివల్ల అది ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించవలసి ఉంది. అలా సాధించగలిగితే దాని జన్మ సార్ధకం. లేదో దానికా గుణమిచ్చి సుఖం లేదని క్రింది స్థాయికి దాన్ని పడగొడతాడట. చూడండి. గుఱ్ఱమూ గాడిదా రెండూ ఒకే జాతి జంతువులు. రెండెందుకు సృష్టి అయినాయి. గాడిద రూపమే ఉన్నా గుఱ్ఱాని కింకా కొన్ని గుణా లదనంగా ఉన్నాయి. బండికి కడితే లాగుతుంది. పందానికి పనికి వస్తుంది. ఆట నేర్పితే నేర్చుకొంటుంది. ఇవి చేయగలిగి నంత వరకూ అది గాడిద కన్నా విశిష్టమైనది. ఎప్పుడైనా చేయజాలక అది మెత్తబడిందో అప్పుడేమి చేస్తారు దానివల్ల. గాడిదలాగే దాన్ని మూటలు మోయటాని కుపయోగిస్తారు మానవులు.
అలాగే మానవుడు కూడా ఆహార నిద్రాదులలో జంతువులతో సమానుడే అయినా వివేక జ్ఞానమనేది వాడికదనంగా ఇచ్చి సృష్టించాడా