#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

  కాగా అలాటి భిన్నమైన మనస్సులకు తగినట్టే వారికి భిన్నమైన శ్రద్ధ కూడా కలుగుతుంటుంది. అందరికీ ఒకే విధమైన శ్రద్ధ ఏర్పడదు. ఒకే విధమైన మనస్తత్త్వముంటే గదా అలా ఏర్పడటానికి. అంచేత కొందరికి సాత్త్వికమైన శ్రద్ధ అయితే కొందరికి రాజసమైతే మరికొందరికి తామసమైన శ్రద్ధ ఏర్పడుతుంది. గుణాన్ని బట్టి శ్రద్ధ శ్రద్ధనుబట్టి వారి ప్రవృత్తి. అందుకే త్రివిధా భవతి శ్రద్ధా అని ఇంతకు ముందు పేర్కొనటంలో ఉద్దేశం.

  పోతే ప్రస్తుత మింతకూ చెప్పదలచిన దేమంటే శ్రద్ధామయో యం పురుషః మానవుడంటే వాడి శ్రద్ధే. శ్రద్ధామయుడు వాడు. శ్రద్ధతో ఆపాదమస్తకమూ నిండిపోయాడు. ఈ దండ సువర్ణమయ మంటే ఏమిటర్ధం. బంగారంతో తయారయింది. అందులో ఉన్నదంతా బంగారం తప్ప మరేమీ లేదని గదా. అలాగే శ్రద్ధామయుడనే మాట కూడా అర్థం చేసుకోవాలి మనం. శ్రద్ధ తప్ప మరేమీ లేదు మానవుడిలో. తలామొలా కాళ్లూ చేతులూ రక్తమాంసాదులూ ఉన్నట్టు కనిపిస్తున్నా అది కాదు మానవుడంటే. అలాగైతే పశుపక్ష్యాదులకూ ఉన్నా యవయవాలూ శరీరమూ. అవీ మానవుడూ ఒకటే నవవలసి వస్తుంది. ఒక ఆదర్శమో లక్ష్యమో దృష్టిలో పెట్టుకొని దాన్ని సాధించే తలంపున్న వాడే మానవుడు. అసలా దృష్టే మానవుడు.

  అందుకే ఒక సూఫీ అంటాడు. ఆదమీ దీ దస్త్ నేపోస్త్ నోస్తిఖాన్. పురుషుడంటే వాడి దృష్టి. వాడి జ్ఞానమే. అంతేగాని వాడి ఎముకలూ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు