యజ్ఞమంటే సత్కర్మాచరణమని అర్థం చెప్పినా చెప్పవచ్చు. ఏ మంచి పని చేసినా తనకూ ఇతరులకూ హితమైన దేది చేసినా అది యజ్ఞమే కాకపోయినా శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి అని గదా పెద్దల నిర్వచనం - ఒక ఈశ్వర చైతన్యమే ప్రపంచాన్నంతా నడుపుతున్నదనే నమ్మకమే అది. అలాంటి ఈశ్వర స్పృహ పెట్టుకొన్న వాడిక ఏ పనికి మాలిన పనీ చేయలేడు. వాడు చేసేదంతా ఈశ్వర ప్రేరణతో ఈశ్వరార్పణ బుద్ధితోనే చేస్తాడు. అలా చేస్తే అది నిజంగా యజ్ఞమే. అదేగదా ఇంతకు పూర్వం చెప్పింది భగవద్గీత. యజ్ఞార్థా త్కర్మణో న్యత్ర లోకోయం కర్మ బంధనః అనే వాక్యాని కేమని చెప్పామర్ధం. యజ్ఞమంటే విష్ణు స్వరూపమని. అలాటి భగవత్రీత్యర్థంగా చేసే ప్రతిపనీ పవిత్రమైనదే నని. అలాంటి యజ్ఞమే మానవుడికి బంధకం కాదని గదా చెప్పాము. ఇంక సందేహ మేముంది మనకు.
కాబట్టి శాస్త్ర జ్ఞానముండి చేసినా శ్రద్ధతో చేయవలసిందే. అది లేక చేసినా శ్రద్ధాళువయి చేయవలసిందే. శ్రద్ధ అనేది ఎక్కడైనా ఉండి తీరాలి. ఇప్పుడు ప్రశ్నేమిటంటే అలాటి శ్రద్ద ఉన్న పెద్దమనిషి పరిస్థితి ఏమిటి. తేషాంనిష్ఠాతు కాకృష్ణ, వాడున్న స్థితి ఎలాంటిదని అడుగుతున్నా డర్జునుడు. సత్త్వ మాహోరజస్తమః - అది సత్త్వమా రజస్సా తమస్సా. వారి పరిస్థితికీ ఈ గుణాలకూ ఏమిటి సంబంధం. ఏ స్థితిలో ఎవడున్నా అది త్రిగుణా