లేకుంటే విషయ మర్థం కాదు. దాని ఫలితం మీరు చూడలేరు. ఇది ఛాందోగ్యంలో ఉద్దాలక మహర్షి చెప్పిన మాట. అతి సూక్ష్మమైన నిరాకారమైన బ్రహ్మ తత్త్వంలో నుంచి అతి స్థూలమైన సాకారమైన ఈ ప్రపంచమెలా సృష్టి అయిందని అనుమానించాడు శ్వేతకేతువు. అప్పుడాయన మర్రి విత్తనం మర్రి చెట్టును దృష్టాంతంగా ఉదాహరిస్తూ శ్రద్ధత్స్వ అలాగే నమ్మి తీరాలిది కూడానని బోధ చేస్తాడు.
ఎందుకిలా నమ్మాలని అడిగితే దాన్ని ఇంకా సాగదీసి వివరించారా మాట శంకర భగవత్పాదులక్కడ. అదేమిటో ఇంతకు ముందు అధ్యాయాలలో వర్ణించాను నేనే. గురుతరమైన శ్రద్ధ ఉంటే విషయం మీద మనసు ఏకాగ్రమవుతుంది. ఏకాగ్ర మయ్యే కొద్దీ దాని అంతరాంతరాలలోకి మన దృష్టి చొచ్చుకొని పోయి అసలు దాని మర్మమేమిటో వెంటనే ఒక మెరపు మెరసినట్టు మనసుకు స్ఫురిస్తుందని గదా అక్కడ చెప్పామప్పుడు. అంచేత అన్ని అనుభవాలకూ మూల కారణం శ్రద్ధ. కనుకనే సాధన చతుష్టయంలో శమాదిషట్కమనే మూడవదానిలో సమాధికి ముందు శ్రద్ధను పరిగణించారు. యోగశాస్త్రంలో కూడా శ్రద్ధకెంతో ప్రాధాన్యమిచ్చారు. యోగులు. శ్రద్ధా మాతేవ యోగినం పాతి. ఒక తల్లిలాగా ఫలితం కలిగే వరకూ కాపాడుతూ వస్తుందట శ్రద్ధ. భగవత్పాదులు కూడా ఫలపర్యంత మిచ్ఛ నిలిచి ఉండాలి సాధకుడికని చాటి చెబుతారు. ఆ ఇచ్ఛ ఏదో గాదు శ్రద్ధే. ఇచ్ఛ అన్నా దీక్ష అన్నా శ్రద్ధ అన్నా అంతా ఒక్కటే.