బ్రహ్మ సూత్రాలని భావిస్తున్నారు. అలాగే వ్యాఖ్యానిస్తున్నారు. అందులో కూడా హేతుమద్భి ర్వినిశ్చితైః హేతువాదంతో నిర్ధారణ చేసిన వాక్యాలని ఉండటం మూలాన తప్పకుండా ఇవి మనన ప్రధానమైన ఉత్తర మీమాంసా శాస్త్రమే నని అపోహ పడుతున్నారు. విద్యారణ్య మధుసూదన సరస్వత్యా దులైన పెద్దలు కూడా అలాటి అపోహలోనే పడిపోయారంటే ఆశ్చర్యపడాలి మనం. కాని ఎవరెంత అపోహపడ్డా ఇక్కడ బ్రహ్మసూత్రాలనే మాట కర్ధం బాదరాయణుడి బ్రహ్మసూత్ర గ్రంధం కాదు. బాదరాయణుడి బ్రహ్మ మీమాంసా గ్రంధం వేదవ్యాసుని మహాభారత కాలంలో లేదు. ఇతిహాస యుగం తరువాత వచ్చాయి షడ్దర్శనాలు. అలాంటప్పుడు వ్యాస ప్రణీతమైన భగవద్గీతలో దాని ప్రస్తావన ఎలా రాగలదు. అసలు కాదు. బ్రహ్మసూత్రాలు రచించిన బాదరాయణుడు కూడా భారత కర్తవ్యాసుడు కాదు. బ్రహ్మ సూత్ర పదైః అనే దానికి కూడా బాదరాయణ సూత్రాలని అర్థం చెప్పలేదాయన. బ్రహ్మతత్త్వాన్ని చెప్పే ఉపనిషద్వాక్యాలని వ్రాశారు. ఆయనకున్న చారిత్రక జ్ఞాన మెవరికీ లేదు. వ్యాసుడికి బాదరాయణుడనే పేరుండవచ్చు. అది వేరే విషయం. ఆ బాదరాయణుడే సూత్రకర్త బాదరాయణుడు కాదు. ఇతడా పేరు యాదృచ్ఛికంగా పెట్టుకోవచ్చు గాక. అంతమాత్రాన ఇద్దరూ ఒకటి కారు. ఇది మనం బాగా గుర్తుంచుకోవలసిన విషయం. పొరబాటు పడగూడదు. ఇలాగే కపిలాచార్యులు కూడా ఇద్దరున్నారు. సాంఖ్యమత ప్రవర్తకుడొకడు. సగర పుత్రులను భస్మం చేసిన అవతార పురుషుడైన కపిలుడొకడు. భాగవతంలో ఇద్దరినీ కలగాపులగం చేసి సాంఖ్య సిద్ధాంతాన్నే కపిలుడు దేవహూతికి బోధించాడని వర్ణించాడు