అంతేకాదు. ఇది నేను ఒకడినే మీకు క్రొత్తగా బోధిస్తున్న దనుకొంటున్నారా. నాలాగా ఎంతోమంది మహానుభావు లెప్పటి నుంచో ఏకరువు పెడుతూ వచ్చిన సత్యమే మీకు నేను మరలా చాటి చెబుతున్నాను సుమా అని అద్వైత దర్శనమే మొదటి నుంచీ అనూచానంగా వస్తున్న సిద్ధాంతమయినట్టు పేర్కొనటం కూడా ఒక చమత్కారమే. ఏమిటది ఎలాగా అంటే చెబుతున్నాడు.
ఋషిభి ర్బహుధా గీతం ఛందోభి ర్వివిధైః పృథక్
బ్రహ్మ సూత్ర పదైశ్చైవ - హేతుమద్భి ర్వినిశ్చితైః - 4
ఋషిభిః బహుధా గీతం. వసిష్ఠాది మహర్షు లెందరో ఎన్నో విధాలుగా చాటి చెప్పిన సిద్ధాంతమిది. అంతేకాదు. ఛందోభిః వివిధైః పృథక్. ఛందస్సులంటే ఋక్సామయజు రాదికమైన వేద వాఙ్మయం - వేదాలు కూడా అనేక మార్గాలలో ఎక్కడికక్కడ వివేచన చేసి చెబుతూ వచ్చాయి. అంతే కాదు. బ్రహ్మ సూత్ర పదైశ్చాపి హేతు మద్భి ర్వినిశ్చితైః - బ్రహ్మ సూత్రాలని ఉన్నాయి కొన్ని బ్రహ్మతత్త్వాన్ని సూచించే వాక్యాలే బ్రహ్మసూత్రాలు. అలాంటి సూత్రాల వల్ల పద్యతే జ్ఞాయతే ఏ బ్రహ్మతత్త్వం సూచన చేయబడుతుందో అది బ్రహ్మ సూత్రాలంటే అప్పటికి బ్రహ్మ స్వరూపావ బోధకమైన ఉపనిషద్వాక్యాలని అర్థం చేసుకోవాలి మనం.
కాని ఇక్కడ చాలామంది బోల్తా పడుతున్నారు. మామూలు పామరులే కాదు. అంతో ఇంతో చదువుకొన్న పండితులే గాదు. శాస్త్రజ్ఞులూ మతాచార్యులు కూడా. బ్రహ్మ సూత్రా లనగానే బాదరాయణుడు రచించిన