#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

నిమిత్తమాత్రుడే గదా. అర్జునుడంటే మనబోటి మానవులమే. మనకే బోధిస్తున్నాడను కోవచ్చు భగవానుడు. కేవలం కృష్ణభగవానుడే అనుకోనక్కర లేదు భగవానుడంటే. ఆ నెపంతో మనకు బోధ చేస్తున్నది వ్యాసభట్టారకుడే.

  ఇప్పుడీ సమాసేన మేశృణు అనే మాటలోనే ఉంది ఎంతోమర్మం. సంగ్రహంగా చెబుతున్నానని గదా అంటున్నాడు. అంటే ఏమని అర్థం. ఎంతో విపులంగా చెప్పవలసిన విషయమంతా సూత్రప్రాయంగా చెబుతున్నాను వినమనేగా. ఏమిటది. క్షేత్ర క్షేత్రజ్ఞులనే రెండు భావాలనూ విడివిడిగా పేర్కొన్నట్టున్నది పైకి. కాని క్షేత్రజ్ఞుణ్ణి పేర్కొనేటప్పు డేమన్నాడో చూచారా. సచయో యత్ప్రభావశ్చ అని రెండు మాటలు విసిరాడు మహర్షి ఒకటి యః అనే మాట మరొకటి యత్ప్ర భావః అనే మాట. యః అంటే ఎవడోనని యత్ప్రభావః అంటే వాడి ప్రభావమేమిటోనని అర్ధం. ప్రభావ మనటంలో ఉన్నది ఉన్న రహస్యమంతా. ప్రభావమంటే వాడి మహిమ. వాడి విభూతి. క్షేత్రజ్ఞుడూ వాడి విభూతి. అంటే ఆత్మా ఆత్మ తాలూకు విభూతి రెండూ కలిసి క్షేత్రజ్ఞుడు. అంటే ఆత్మానాత్మలు రెండూ కలిపి పట్టకొంటేనే అది క్షేత్రజ్ఞుడని చెప్పినట్టయింది. అనాత్మ అంటే క్షేత్రమే గదా. అప్పటికి క్షేత్రమేదోగాదు క్షేత్రజ్ఞుడి ప్రభావమే వాడి విభూతే వాడి విస్తారమే నన్నమాట. క్షేత్రజ్ఞుడు స్వరూపమైతే క్షేత్రమనేది ఏదో గాదు దాని విభూతే. విభూతి స్వరూపం కంటే వేరుగా7దు గనుక క్షేత్రక్షేత్రజ్ఞులకు భేదం లేదు. క్షేత్రమంతా క్షేత్రజ్ఞుడేననే అద్వైత భావాన్ని మనకెంత చమత్కారంగా అందిస్తున్నాడో చూడండి మహర్షి.