అసలా మాటకు వస్తే భాష్యకారుల విచారణా కాదు. దాని ననుసరించి చేసిన నా విచారణా కాదు. ఏదీ అక్కర లేదు. తొందర పడకుండా కొంచెం ముందుకు వెళ్లి చూచామంటే వ్యాసభగవానుడే చేయబోతాడీ రెండింటికీ బ్రహ్మాండమైన పరిష్కారం. క్షేత్ర క్షేత్రజ్ఞులని ద్వైతరూపంగా పేర్కొన్న రెండింటినీ అద్వైత రూపంగా ఏకం చేసి చూపబోతున్నాడు తానే స్వయంగా మహర్షి. అది ఎలాగో కొంచెం లోతుకు దిగి చూచామంటే మనకే తేటతెల్లంగా తెలిసిపోతుందా అద్వైత తత్త్వం. అది ఎలాగో మహర్షి మాటలలో వరుసగా విందాము మనం.
తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ - యద్వికారి యతశ్చయత్
సచయో యత్ప్రభావశ్చ - తత్సమాసేన మేశృణు - 3
క్షేత్ర క్షేత్రజ్ఞుల స్వరూపమేమిటో మొదట మనం సవిస్తరంగా తెలుసుకోవలసి ఉంది. తత్ క్షేత్రం యచ్చ. క్షేత్రమంటే ఏమిటసలు. యాదృక్చ ఎలాంటి దది. దాని లక్షణాలేమిటి. యద్వికారి వికారమేది యతశ్చయత్ - దేనివల్ల ఏది ఉత్పన్నమవుతున్నదనే ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పకొంటేనే గాని క్షేత్ర స్వరూపం చక్కగా గ్రహించిన వాళ్ళం కాము.
అలాగే సచ యో యత్ప్రభావశ్చ - ఆ క్షేత్రజ్ఞుడనే వాడెవడు. వాడి ప్రభావమేమిటి. ఎలాంటిదని కూడా గ్రహించ వలసి ఉంది. తత్సమాసేనమే శృణు. ఇదంతా సంక్షేపంగా నేను చెబుతాను నీవు చక్కగా విని అర్ధం చేసుకోమంటున్నాడు కృష్ణభగవాను డర్జునుడితో. అర్జునుడనే వాడు