ఎండమావులు సూర్యప్రకాశాని కడ్డు తగలకపోగా దాన్ని కూడా వస్తుతః వ్యాపించే ఉన్నది సూర్యరశ్మి. అలాగే వ్యాపించే ఉన్నాడు క్షేత్రజ్ఞుడీ క్షేత్రాల నన్నిటినీ. కాదా. ఏ జ్ఞానమైతే తన వ్యాప్తికేదో అడ్డు తగులుతున్నదని భ్రమ పడుతున్నదో అది జీవుడయింది. తనకే అడ్డూ లేదని ఏది నిత్యమూ భావిస్తుందో అది ఈశ్వరుడయింది. అంత మాత్రమే. ఆ భ్రాంతి ఉన్న వాడు సంసారి. అది లేని వాడ సంసారి. అంచేత సంసారమనే దొకటి వస్తుసిద్ధంగా లేదు. దృష్టి సృష్టి అది. జీవ దృష్టికి సంసారం. ఈశ్వర దృష్టికి సాయుజ్యం. ఇలా అన్నాము గదా అని జీవుడొకడు ఈశ్వరుడొకడూ ఒకరికొకరు వేరుగా ఉన్నారని భ్రమపడరాదు మరలా. ఉన్నది ఒకే ఒక అఖండమైన చైతన్యం. జీవుడైనా అదే. ఈశ్వరుడైనా అదే. అదే ఒక దృష్టితో చూస్తే అంతా క్షేత్రజ్ఞుడి స్వరూపమే ననే అభేదానుభవానికి తోడ్పడుతుంది. అంతా క్షేత్రజ్ఞుడని భావించటమే అద్వైత జ్ఞానం. అలా కాక క్షేత్రజ్ఞుణ్ణి కాదని క్షేత్రాన్ని మాత్రమే పట్టుకొంటే సాంఖ్యల నిరీశ్వర వాదంలో పడిపోతాము. క్షేత్రాన్ని లయం చేసుకోలేక క్షేత్రజ్ఞుణ్ణి మాత్రమే సత్యమని భావిస్తే విజ్ఞాన వాదులైన బౌద్ధుల ముఠాలో చేరిపోతాము. పోతే అద్వైతులమే అనిపించుకోవాలంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడి ఆభాసగా అర్థం చేసుకొని దీన్ని దాని కనన్యంగా దర్శిస్తేనే సుమా - మరోవిధంగా దర్శిస్తే అది సమ్యగ్దర్శనమే Right Knowledge కాదని ఈ విచారణ వల్ల తేలిన సారాంశం. ఇది బాగా ఆకళించుకోగలిగితే ముందు చెప్పినట్టు భగవత్పాదుల సుదీర్ఘ విచారణ కూడా ఇందులోనే కలిసి వస్తుంది.