వీడికీ లేదీ సంసార బంధం. ఈశ్వరుడెప్పుడూ బద్ధుడు కాడు కాబట్టి వాడికీ లేదు. ఇంతకూ జ్ఞానాజ్ఞానాలలోనే ఉంది ఉన్న కీలకమంతా. జ్ఞానస్వరూపుణ్ణి నేనని గుర్తిస్తే చాలు. ఈశ్వరుడు వేరే లేడు. జీవుడే ఈశ్వరుడు. గుర్తించ లేదో జీవుడు జీవుడే. ఈశ్వరు డీశ్వరుడే. శరీరమాత్ర నియంత్రితుడు జీవుడు. సర్వ శరీర వ్యాపకుడీశ్వరుడు. అజ్ఞానం వల్ల జీవేశ్వర భేదమైతే జ్ఞానం వల్ల అభేదం.
ఇక్కడికి ఒక సందేహం నివృత్తి అయింది మనకు. పోతే ఇక మరొక సందేహం. ఏమిటది. జీవేశ్వర భేదం లేకపోవచ్చు. జ్ఞాన మఖండం గనుక ఇద్దరూ ఒక్కటే కావచ్చు. సర్వ శరీరాలూ వ్యాపించవచ్చు. కాని ఏ క్షేత్రాలలో వ్యాపించాడో ఈ క్షేత్రజ్ఞుడా క్షేత్రాలనేవి ఒకటి వీడికి భిన్నంగా కనిపిస్తుంటాయి గదా. ఇలా క్షేత్ర క్షేత్రజ్ఞులనే రెండు తత్త్వాలున్నప్పుడది తత్త్వం Reality కాదు. దాని ఆ భాస Appearance. ఆ భాస వాస్తవం కాదెప్పుడూ. సూర్యరశ్మి మనకొక మృగతృష్టికలాగా కనిపించిందంటే అది అక్కడ వాస్తవంగా ఉన్నదనా. కాదు. ప్రకాశమే అలా ఒక మృగతృష్ణ లాగా భాసిస్తున్నది. భాసిస్తున్నా అది దానికన్నా వేరు గాదు. అలాగే ఇప్పుడీ క్షేత్రాలు కూడా క్షేత్రజ్ఞుడైన ఆత్మకు పాధులే. కేవలం దాని ఆభాసలే. ఆత్మే అనాత్మ ప్రపంచంగా భాసిస్తున్నదన్న మాట. ఇది మొదటి నుంచీ చర్విత చర్వణంగా చాటి చెబుతూనే వచ్చా మీ మాట. ఇప్పుడూ అదే చెబుతున్నాము. వస్తుసిద్ధంగా లేదీ క్షేత్రమనేది. అయినా కనిపిస్తున్నదంటే అది మన బుద్ధి కల్పితం. ఆ బుద్ధి అవిద్యా కల్పితం. అవిద్యా కల్పితం గనుకనే కనిపిస్తున్నాలేదది. లేదు గనుకనే క్షేత్రజ్ఞుడి వ్యాప్తికది అడ్డురాదు.