మోక్ష పురుషార్ధాన్ని మాత్రమలా ఎప్పటికీ త్రోసి పుచ్చ లేవు. అది నీవు త్రోసి పుచ్చినా పోయేది కాదు. ఇవి మూడూ సాపేక్షమైతే Relative అది నిరపేక్షం Absolute. ఇవి బుద్ధితంత్రమైతే Apparant అది వాస్తవం Real . ఇవి విషాదానికి దారితీస్తే అది ఆహ్లాదాన్నే అందిస్తుంది. చివరికివి సమస్యను తీర్చకపోగా దాన్ని ఎక్కువ చేసి చూపితే అది జీవితాని కిక ఏ సమస్యా లేకుండా పరిష్కరిస్తుంది. మరి అలాంటి మోక్షం కోసం మానవుడు ఎంతగా కృషి చేయాలి. చేయాలంటే ఎంత శ్రద్ధ చూపాలి.
కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానమని ఘోషిస్తుంది భగవద్గీత. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞాన మబ్బుతుందట. ఏ జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం. ఐహికమైన జ్ఞానాలకే కావలసివస్తే ఆముష్మికమైన బ్రహ్మ జ్ఞానాని కెంత కావాలో చూడండి శ్రద్ధ. అదెలా ఉంటుందా శ్రద్ధ అంటే తత్పర స్సంయతేంద్రియః అంటున్నాడు మహర్షి. తత్పర. అదే లోకంగా ఉండాలి నీవు. పైగా అటూ ఇటూ చెదిరిపోయే ఇంద్రియ చాపల్య ముండ కూడదు. అప్పుడే జ్ఞానం లబ్ధ్వా. లభిస్తుంది జ్ఞానం. దానివల్ల ఏమిటి ఫలితమని అడుగుతావా. పరాంశాంతిం. అత్యంతమైన శాంతి. అదే మోక్షం జీవితానికి. ఇది భగవద్గీతే గాదు. అసలు మహాభారత కథ ద్వారానే సూచిస్తున్నాడు మహర్షి లోకానికి. శునక వృత్తాంతంతో ప్రారంభమయి శునక వృత్తాంతంతో ముగిసింది భారత కథ. భారత కధా శ్రోత అయిన జనమే జయుడు దీర్ఘ సత్రయాగం చేస్తుంటే ఒక శునక శిశు వక్కడికి వచ్చింది. దానిని