పరిష్కారమొకటి దానికుందని తెలిసినా సుఖం లేదు. మరేమిటంటారు. పరిష్కార మార్గమేదో అది కావాలి మానవుడికి. అలాటి ప్రయత్నం లేనంతవరకూ ఏమి ప్రయోజనం. సమస్య పాటికి సమస్యే. పరిష్కారం పాటికి పరిష్కారమే. రెంటికీ లంగరందదు. సమస్యను పరిష్కారంగా మార్చేది సాధన తప్ప మరేదీ గాదు. అంచేత సాధనే అన్నిటికన్నా ప్రధానమైనది.
కాగా ఈ సాధన దేనిమీద ఆధారపడి ఉందో తెలుసా. మానవుడి శ్రద్ధ మీద. శ్రద్ధేమిటి. శ్రద్ద అంటే ఆస్తిక్య బుద్ధి అని నిర్వచించారు శాస్త్రజ్ఞులు. ఒకటి ఉందనే నమ్మకం. విశ్వాసమే శ్రద్ధ. నమ్మవలసిన విషయం మనమే దృష్టమైతే ఎవరూ చెప్పనక్కర లేదు. మనపాటికి మనమే నమ్ముతాము. దృష్టం కాక అదృష్టమైన విషయంలోనే మానవుడికి నమ్మకం కుదరదు. అలాటి విషయ మేమిటని అడుగుతారేమో. రెండే ఉన్నాయలాంటివి. ఒకటి ధర్మం మరొకటి బ్రహ్మం. అర్థకామాలలాగా ప్రత్యక్షం కాదని మనకు. పరోక్షం. శాస్త్రం చెప్పటమే గాని అనుభవంలో లేవు. అనుభవంలో లేవు గదా అని నమ్మకుండా పోరాదు. ఆ మాటకు వస్తే ప్రత్యక్షమైన లోక వ్యవహారంలో కూడా మనం చూడకపోయినా ఒక విషయంలో నమ్మకం పెట్టుకొనే వ్యవహరిస్తుంటాము. నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని లోకంలో కూడా వాడుక. ఒక విద్యనభ్యసిస్తే ఫలితముంటుందనేనా అభ్యసిస్తాము. ఒక వ్యాపారం చేస్తే లక్షలు