17. శ్రద్ధాత్రయ విభాగ యోగము
దైవాసురాధ్యాయ మయింది. ప్రస్తుతం పదిహేడవదైన శ్రద్ధాత్రయంలో ప్రవేశిస్తున్నాము. దీనికి ముందు భగవద్గీతలో ఇప్పటికి 16 అధ్యాయాలు గడిచాయి. ఇక మీదట ఒకే ఒక అధ్యాయం మిగిలిపోయింది. దానితో గీత సమాప్తం కాబోతున్నది. మొదటి అధ్యాయం విషాద యోగం. అది మానవ జీవితానికున్న సమస్య ఏదో చెప్పింది. చివరది మోక్ష సన్న్యాసం. అది సమస్యకు పరిష్కారమేదో దాన్ని చెప్పబోతున్నది. పోతే దానికీ దీనికీ నడుమ 16 అధ్యాయాలున్నాయి. అవి సమస్యను పరిష్కరించుకొనే సాధన మార్గమేదో దాన్ని అంచెల వారిగా వర్ణించటానికి వచ్చాయి. అది సమస్యకంటే పరిష్కారం కంటే కూడా ముఖ్యమైనది. ఎందుకంటే సమస్య ఉందని తెలిసి సుఖం లేదు.