మరచిపోగూడదు. శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రమే ప్రమాణం నీకు. శాస్త్రమంటే ఈ మానవులు స్వబుద్ధితో కల్పించుకొన్న భౌతికాది శాస్త్రాలు Sciences కావు. అవి నీ జీవిత గమ్యాన్ని నీకు గుర్తు చేయలేవు. జీవిత సమస్య నసలే పరిష్కరించలేవు. పురుషార్ధానికి తోడ్పడేదేదో అదే శాస్త్రమసలు. అదే నీకు ప్రమాణం మార్గదర్శకం. ఏమి చేస్తుందది నీకు. ఎలా చూపుతుంది మార్గం. కార్యాకార్య వ్యవస్థితౌ. ఏది చేయాలో ఏది చేస్తే నీవు గమ్యం చేరగలవో అలాటి కార్యాన్ని నీకు బోధిస్తుంది. అలాకాక ఏది చేస్తే చేరలేవో అలాటి అకార్యం వైపు చూడకుండా నిన్ను హెచ్చరిస్తుంది. ఎడా పెడా నీకు సహాయం చేసేది శాస్త్రమే. అంతకన్నా ఆప్తుడు లేడు నీకు.
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం - కర్మ కర్తుమిహార్షసి. అంచేత శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకొని అది నీకు విధించిన కర్మ లేవో తెలుసుకొని కేవలం తెలుసుకోటం వరకే నీ డ్యూటీ అనుకోక అది చెప్పిన మార్గంలో ఆ తెలిసిన దాన్ని అమలుపరచి దానికి తగిన సత్ఫలితాన్ని ఎప్పటికైనా చవి చూడగలిగితే అదే నీ జీవితానికి సాఫల్యం. అది ధర్మ ఫలమైతే అర్థకామాలకన్నా చాలా మంచిదని సంతోషించు. అదీ కూడా కాక కేవలం మోక్షఫలమే అయితే ఇంకా ఎక్కువగా ఆనందించు. ఎందుకంటే ధర్మం సాపేక్షమైతే Relative మోక్షం నిరపేక్షం Absolute. ధర్మం వల్ల పునరావృత్తి తప్పదు. మోక్షమనేది సిద్ధిస్తే ఇక పునరావృత్తి భయమే లేదు