ఆశ్చర్యం లేదు. అది చాలా ప్రమాదకరం. అంచేత అలాటి శాస్త్ర విషయం బోధిస్తున్నారు మనకిప్పుడు మహర్షి.
యః శాస్త్ర విధి ముత్సృజ్య - వర్తతే కామ కారతః
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతిమ్ - 23
శాస్త్రమనగానే లోకానుభవం గుర్తుకు వస్తుంది చాలా మందికి. లోకం చాలుగదా మాకీ శాస్త్రంతో పనేమిటని ఎక్కడికక్కడ తృప్తి పడి జీవితం గడుపుతుంటారు నూటికి తొంభయిమంది. ప్రమాణమంటే వారికి ప్రత్యక్షమే ప్రమాణం. మహా అయితే అనుమానం. మొదటిది లోకజ్ఞానమైతే రెండవది సాపేక్షమైన భౌతిక రసాయనాది శాస్త్రజ్ఞానం. అంతకుమించి నిరపేక్షమైన అభౌతికమైన సత్యాన్ని బోధించే శాస్త్రమొకటి ఉందని తెలియదు వీరికి. తెలిసినా హేతువాదంతో దాన్ని త్రోసి పుచ్చుతారు. అది మానవ నైజం. శాస్త్ర మనేది లౌకికం కాదు. భౌతికం గాదు. వీటి రెండింటినీ మించిన ప్రమాణమని దాని గొప్పతనాన్ని చాటటాని కిప్పుడు గీతాచార్యుడు మొదట ప్రతిలోమంగా వర్ణిస్తున్నాడు.
యః శాస్త్ర విధి ముత్సృజ్య. అపేరుషేయమైన ఆ శాస్త్రం మన మేలుకోరి కొన్ని విధులు చేయమని మనకు పురమాయిస్తుంది. మరికొన్ని చేయవద్దని నిషేధిస్తుంది. అది చేయమన్నది మానేసి వద్దని నిషేధించినవి చేస్తూ పోయామంటే దాన్ని కామకార మంటారు. వర్తతే కామ కారతః అలా తన ఇష్టానుసారంగా ఎవడైనా ప్రవర్తించాడను కోండి. ఏమవుతుంది