నరక ద్వారాలలో నుంచీ బయటపడాలి. ఎలాటివీ ద్వారాలు. తమో ద్వారాలివి. చీకటిదారులు. వీటిలో తిరుగుతున్నంత వరకూ దిమ్మ తిరిగి పడిపోవలసిందే గాని నిర్గమన మార్గమేమిటో ఎక్కడ ఉందో ఏమాత్రమూ అంతు పట్టదు. వెలుగుంటే గదా ఏదైనా కనిపించేది. కాబట్టి వెలుగులాటి జ్ఞానానికి ముందు ప్రయత్నించాలి. ఏమిటా జ్ఞానం. ఎలా అర్జించాలది. ఈ కామక్రోధాదులకు మూడింటికీ ప్రతి ద్వంద్వి Opposite అయిన భావాలు. దమ దాన దయలు. అలాటి దైవ గుణాల భ్యసిస్తూ పోవాలి ముందు. వాటివల్ల సత్త్వమనేది శుద్ధి అవుతుంది మానవుడికి.
సత్త్వం శుద్ధి అయితే జ్ఞానమనేది ఉదయించటాని కిక ప్రతిబంధకం లేదు. సత్త్వాత్సం జాయతే జ్ఞానమని భగవానుడే హామీ ఇచ్చాడు. అలాంటప్పుడిక సందేహమేముంది. అంచేత వివేకవంతుడయిన వాడు మొదట తనలో ఉన్న అసుర గుణాలేవో గుర్తించి వాటిని పోగొట్టుకోటానికి దైవగుణాలు తెచ్చి పెట్టుకోవటం అవశ్య కర్తవ్యం. దైవగుణాలు మనసును శుద్ధి చేస్తే గాని పరచింతన మీదికి దృష్టి మరలదు. అలా దైవ గుణ సంపన్నుడైన మానవుడే ఆచరత్యాత్మనః శ్రేయః తన జీవితానికేది శ్రేయోదాయకమో అలాటి సాధన మార్గమవలంబించి. ఆ మార్గంలోనే పయనించగలడు. ప్రేయస్సు శ్రేయస్సన్నారు మహర్షులు. ప్రేయస్సు ప్రియమైనదే గాని హితమైనది కాదు. ప్రేయస్సు సంసారం వైపు తీసుకెళితే శ్రేయస్సు అంతకంతకూ సాయుజ్యానికి తోడ్పడుతుంది.