#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

  పోతే మరొకటి దర్పం. యస్యోద్భవే ధర్మ మ తిక్రామతి ఏది ప్రబలితే ధర్మాన్ని కూడా లక్ష్య పెట్టడో అది. ఇక కామం చెప్పనే అక్కర లేదు. స్త్రీ సాంగత్యాది విషయం. దాని సహోదరుడు క్రోధం. తనకేది ప్రతికూలంగా జరిగినా మండిపడే లక్షణం. ఇవేగాక వీటి జాబితాలో చేరే అవగుణాలెన్ని ఉన్నాయో అన్నీ వారు పోగుచేసుకోవాలని ఆశపడే సంపదే. ఇంత అసుర సంపద పోగు చేసుకొనే వాడికిక దైవమెక్కడ కనిపిస్తుంది. మామాత్మ పరదేహేషు ప్రద్విషంతః అభ్యసూయకాః ఈశ్వరుడనే ఒక అతీతమైన శక్తి ఉన్నది. అది తన దేహంలోనూ తన తోడి వారి దేహంలోనూ అన్ని వ్యాపారాలకూ సాక్షిగా నిలిచి చూస్తున్నదనే చూపే ఉండదు వారికి. అలాటి చూపులేక పోగా ప్రద్విషంతః దాన్ని ద్వేషించటమే గొప్పగా భావిస్తారు. మచ్ఛాసనాతి వర్తిత్వం ప్రద్వేషః అని వ్యాఖ్యానిస్తున్నారు స్వామివారు. ఈశ్వర శాసనాన్ని ఉల్లంఘించి బ్రతకటమే ప్రద్వేషమనే మాట కర్థమట. అలా ద్వేషించటమే గాక ఈశ్వర మార్గంలో ఉన్న సాధు పురుషులని ఎవరినైనా కీర్తిస్తుంటే అభ్యసూయకాః ఏమాత్రమూ సహించలేరట. కలియుగ హిరణ్య కశిపులను కోవచ్చు. లేదా కాలయవనులను కోవచ్చు.

తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్
క్షిపా మ్యజస్ర మశుభాన్ - ఆసురీష్వేవ యోనిషు - 19

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు