#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

దేవతామూర్తులను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అదంతా ఋజు బుద్ధిలో చేసే పనులు కావు. దంభేన - అవి ఒక ప్రదర్శన. నలుగురికీ ఆడంబరంగా కనిపించే ప్రయత్నం. అదైనా విధి విహితంగా చేస్తారా పాడా. అవిధి పూర్వక మంటున్నాడు మహర్షి. తమ ఇష్టానుసారంగా సాగిస్తుంటారు. పదిమందీ చూచి ఆహా ఎంత ఆచారపరుడూ ఎంత ధార్మికుడూ ఎంత భక్తాగ్రేసరుడని మెచ్చుకోవాలనే తప్ప మరేదీ గాదు.

అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః
మా మాత్మ పరదేహేషు - ప్రద్విషంతో 2 భ్యసూయకాః - 18

  అంతేకాదు. వీరి వెఱి వేషాలు చాలా ఉన్నాయి. అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః - అహంకార మనేది ఎంతైనా ఉంటుంది వీరికి. ఏమిట హంకారమంటే- చెబుతున్నారు భాష్యకారులు. విద్యమానై ర విద్య మానైశ్చ గుణై రాత్మని అధ్యారోపితైః - తమలో ఉన్నా లేకున్నా ఎన్నో గొప్ప గుణాలు తమ కారోపించుకొంటూ విశిష్ట మాత్మాన మహమితి మన్యంతే - వాటితో కూడిన మహానుభావుణ్ణి నేనని తమలో మురిసిపోతుంటారు. దీనికే అహంకారమని పేరు. సర్వదోషాణాం మూలం సర్వానర్ధ వృత్తీనాంచ అని చాటుతున్నారాయన. అసలన్ని అవలక్షణాలకూ అన్ని అనర్థ వ్యాపారాలకూ ఇదే మూలమట. అలాగే బలమనే మరొక దోషం. ఇతరులెంత వారైనా లెక్క చేయక వారిని చాలా తక్కువగా చూడటం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు