మనబోటి వాళ్లకు కలిగించటానికే ఇంకా చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తున్నాడు మహర్షి.
ఆత్మ సంభావితాః స్తబ్ధా - ధన దాన మదాన్వితాః
యజంతే నామయజ్ఞస్తే దంభే నా విధి పూర్వకమ్ - 17
ఆత్మ సంభావన ఉన్నవాడెవడో వాడాత్మ సంభావితుడు. తన పాటికి తానే చాలా గొప్పవాడనని భావించే వారంతా ఆత్మ సంభావితులు Self Complacent fellows స్వోత్కర్ష చాటుకొనే డబ్బారాయళ్లని అర్థం. ఒకరు పొగడట మలా ఉంచి ఈసడించు కొంటున్నారని కూడా చూడక తమ్ము తామే పొగడుకొంటుంటారు. స్తబ్ధాః తమ కన్నా పెద్దలున్నారు. వారిని గౌరవించాలని కూడా చూడకుండా తలవంచని పొగరుబోతు తనంతో మెలగుతుంటారు లోకంలో. అంతేకాదు. ధనమాన మదాన్వితాః - చాలాసార్లు వచ్చిందీ మాట. ధనమదం – అభిమాన మదం మూర్తీభవించి నట్టు కనిపిస్తారు తమ ప్రవర్తనలో.
అదంతా కప్పి పుచ్చుకోటాని కెక్కడ లేని భక్తి శ్రద్ధలూ ప్రదర్శిస్తుంటారు. ఎవరికీ లోకులకా. లోకులకు గాదు. లోకులకే గాదు. ఊర్థ్వలోక వాసులైన దేవతలకు కూడా. యజంతే నామయజ్ఞః - పేరుకు ఏవేవో యజ్ఞాలూ యాగాలూ వ్రతాలూ నిష్ఠలని ధర్మకార్యాలు చేస్తున్నట్టు నటిస్తుంటారు. వాటితో ఇటు లోకులనూ అటు లోకాతీతులైన