విమోహమూ రెండూ వీరినెత్తి నెక్కి కూచున్నాయి రెండు పిశాచాలు. అసలు జీవితమంటే ఏమిటో దాని పరమార్థమేమిటో తెలియక పోవటమజ్ఞానం. అది వివిధ రూపాలుగా మనసును త్రిప్పుతూ పోతే అది విమోహం. ఆవరణ విక్షేప ముఖాలివే మాయా శక్తికి. ఇప్పుడీ వర్తమాన కాలంలో కూడా చూడండి. అప్పుడెప్పుడో చెప్పిన మహర్షి వాక్కు ఎంత చక్కగా అతికినట్టు మన రాజకీయ వర్గాలకు సరిపోతున్నాదో. ఒక్క మన దేశమనే గాదు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ పరుచుకొని ఉన్నదీ పైశాచికమైన ప్రవర్తన. పూర్వమెప్పుడో చరిత్రలో విన్నాము. బింబిసారుణ్ణి చంపి అజాతశత్రువూ అజాత శత్రుణ్ణి చంపి బింబిసారుడూ రాజ్యానికి వచ్చారని. అన్నదమ్ములను చిత్రవధ చేసి ఔరంగజేబు లాంటి కర్కోటకుడు గద్దె ఎక్కాడని. అది ఇప్పుడెటు పోవాలో. అలాటి కర్కోటకులూ తక్షకులూ వేలు లక్షలు సాక్షాత్కరిస్తున్నా రిప్పుడీ లోకంలో మనకు. ప్రజలేమై పోయినా సరే. ప్రపంచమేమై పోయినా సరే. ఎవరి ప్రాణాలు తీసి అయినా సరే. ఏది ఎలా సర్వ నాశనమైనా సరే. తమ ధనమే ధనం. తమ సుఖమే సుఖం. తమ జీవితమే జీవితం. దానికోసం ఎంతైనా ఖర్చు చేయగలరు. ఎంతమందినైనా కొనగలరు. ఎన్ని దారుణాలైనా చేయగలరు. పెద్ద మనుషులని పించుకోటాని కెన్ని సుభాషితాలైనా వల్లించగలరు. తమకతీత శక్తులేవైనా తమ దారి కడ్డు పడతాయేమోనని ఎన్ని విగ్రహాలకైనా