ఈ కలియుగ మానవుల వ్యవహారమే. ముఖ్యంగా లక్షాధికారులూ కోటీశ్వరుల వ్యవహారమిది. ఏదో గడ్డి తిని కంప దీని లక్షలు కోట్లు గడిస్తారు కొంతమంది. వారు గృహస్థులే గాదు ఉద్యోగస్థులే గాదు వ్యాపారస్థులే గాదు. ప్రాక్టికలుగా మాటాడితే అందరూ ఇప్పుడు వ్యాపారస్థులే. వ్యాపారో ద్రోహచింతన మన్నారు. డబ్బు కోసమే గదా ఏ వ్యాపారమైనా. అది అంతో ఇంతో మోసం చేయకుంటే రాదు. న్యాయంగా కొంత ఒనగూడినా లక్షలు కోట్లు సమకూడాలంటే అంతకంత కన్యాయం చేయకపోతే ఆర్జించలేవు. కోటాను కోట్లు పోగు చేసుకోవాలంటే విద్యను కూడా పణంగా పెట్టి ఆర్జించవలసిందే. అసలు ధనార్జన కోసమే విద్య అని ఎప్పుడనుకొన్నారో అప్పుడు దానికి దారి తీసే విద్యలే నేర్వవలసి వస్తున్నది. అందుకే గదా తర్క వేదాంత సంగీత సాహిత్యాది విద్యలన్నీ మూలబడి ప్రస్తుతం అణు విద్యుద్భౌతిక రసాయనాది విద్యలన్నీ పైకి వచ్చాయి. అందులో ఒకరి కొకరు పోటీ పడి ఉత్తీర్ణులయి స్వదేశాన్ని కూడా విడిచి పెట్టి విదేశ వాసాన్నే తన్మూలంగా ద్రవ్య సంపాదననే జీవితానికి పరిపూర్ణతగా ద్రవ్య సంపాదననే జీవితానికి పరిపక్వతగా భావిస్తున్నారు. విజ్ఞానానికీ వివేకానికీ గాదు విద్య ఇప్పుడు. విశేష ధనార్జనకూ వినోదానికే నని మనకే భగవద్గీతా చెప్పనక్కర లేదు. మన ఈనాటి జీవిత విధానమే సాక్ష్యమిస్తున్నది.