బ్రతుకుతుంటారు. చివరకది తీరకుండానే చచ్చిపోతారు. ఇక వీరు సాధించిందేమిటి జీవితంలో. ఇటు తాము కోరిన కోరికలూ తీరలేదు. అటు తాము కోరని మోక్షమూ దక్కలేదు. జ్ఞానముంటే గదా మోక్షానికి నోచుకొనేది. జన్మతో వచ్చిన ఆ కొంచెం జ్ఞానమూ అనాత్మ విషయమైన కామ పురుషార్ధానికే సరిపోయె. ఇక ఆత్మేమిటి. దాని జ్ఞానమేమిటి. తజ్జన్యమైన మోక్షఫలమేమిటి. అది కలలోని వార్త. బీజం నాటకుండా వృక్షం పైకి వచ్చి దాని ఫలమందు కోవాలంటే అవుతుందా.
ఆశాపాశ శతై ర్బద్ధాః - కామక్రోధ పరాయణాః
ఈహంతే కామభోగార్ధ - మన్యాయే నార్థ సంచయాన్ - 12
ఇంతకూ జ్ఞానమా పాడా. ధర్మమే లేదు. జ్ఞానమూ లేదు. అవన్నీ పెద్ద పెద్ద మాటలు. వీరందరికీ ఉన్నదొకటే. అది ఆశ. ఆశాపాశ శతైర్బద్ధాః ఆశ అనేదే ఒక పాశం. ఒక్క పాశం కాదు. ఆశ ఒక్కటైతే గదా పాశ మొకటి కావటానికి. వందలు వేలు ఆశలైతే వందలు వేలవి పాశాలయి చుట్టుకొంటుంటాయి. ఇటూ అటూ లాక్కొని పోతుంటాయి. కామక్రోధ పరాయణాః - ఇక వేరొక ఆలోచన ఏముంటుంది. ఏ మంచి ఆలోచనకూ ఆస్కారం లేదక్కడ. కలిగే ఆలోచనలన్నీ కామక్రోధాలనే ద్వంద్వాలతో నిండిపోయినవే.
ఒకటి ఫలిస్తే కామం. అది ఫలించకపోతే క్రోధం. శాయశక్తులా తన కనుకూలించాలనే కోరుతాడు. అయితే కోరినవన్నీ అనుకూలిస్తాయని