ఈ అనర్థాని కంతటికీ ఏమిటి మూలకారణం. ఒక్కటే. కామం. అనులోమమైనది శ్రద్ధ అయితే దానికి ప్రతిలోమమైనది కామం Segacity Avarice. అది ఒకటుంటే చాలు. అన్ని అవలక్షణాలూ అదే తెచ్చి పడేస్తుంది. దుష్పూరమది. దాని కడుపు నింపట మసాధ్యం. హవిషా కృష్ణ వర్మేవ అన్నాడు వ్యాసభగవానుడు. ఆజ్యం పోసే కొద్దీ అగ్ని మండుతూనే ఉంటుంది గాని ఆరిపోదు. అలాగే కోరికలు తీరేకొద్దీ పెరుగుతూనే పోతుందీ కామం. తరిగిపోదు. కనుకనే అగ్ని కనలమని పేరు వచ్చింది. అలమంటే చాలునని అర్థం. చాలుననే ప్రశ్నే లేదట అగ్నిహోత్రానికి కామానికి కూడా అంతే.
దంభ మానమదాన్వితాః ఆడంబరమూ అభిమానమూ అహంకారమూ ఇన్ని దగ్గర పెట్టుకొని కామం లేదంటే వారికెలా లేకపోతుంది. కనుకనే మోహాదృహీత్వా అసద్రాహాన్ - వివేక బుద్ధి కోల్పోయి పశుప్రాయంగా బ్రతుకుతుంటారు. పశువులైనా నయం. వాటి ముక్కుకు సూటిగా పోతుంటాయవి. తమ పాటికి తాము బ్రతుకుతుంటాయి. వీరికలా కాదు. తాము తప్ప ఎవరూ బ్రతకగూడదు. అసర్గ్రహాన్ గృహీత్వా. ఏవి పనికి రావో అలాటి వాటిని పట్టుకొంటారు. అశుచివ్రతాః - దానివల్ల ఒకరిని దెబ్బ తీసే పనులు చేయటమే వ్రతంగా పెట్టుకొంటారు. ఎప్పుడూ ఒకరి మీదనే దృష్టి. అదీ వారి బాగుకు కాదు. ఓగుకు. ఉపకారానికి కాదు ఉపద్రవానికి.