#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

తోడి ప్రాణులకు హానికరమైన పాప కృత్యాలు ఏమైనా చేయటానికి వెనుదీయరు. తమ స్వార్థం కోసం దేనికైనా పాలుపడుతారు. క్షయాయ జగతో ఽ హితాః - లోకులకు అహితం చేయటమే గదా వారి ధ్యేయం. అది లోకానికే గాక తమకూ ఎప్పటికైనా చేటు దెస్తుందని కూడా భావించరు. ఇది ఈనాటి భౌతిక శాస్త్రజ్ఞులకూ రాజకీయ వాదులకూ కూడా ఒక పెద్ద హెచ్చరిక.

  ఈ శాస్త్రజ్ఞుల బుద్ధులేమి బుద్ధులు. ప్రాపంచికమేగా. పారమార్థికమైన గొప్ప బుద్ధి ఎవరికున్నది. ఎక్కడికక్కడ ఏవేవో పిచ్చి పిచ్చి పరిశోధనలు సాగించి ఎన్నెన్నో మారణాయుధాలు సృష్టిస్తే వారి కండదండగా పాలక వర్గాలు నిలిచి వారినందుకు పురికొల్పుతుంటే ఇదంతా ప్రజాబాహుళ్యానికి వినాశకం గాక సుఖశాంతులెలా కలిగిస్తాయి. వీరి ప్రయోగాల మూలంగా వాతావరణమంతా దెబ్బతిని ఋతుధర్మాలన్నీ తల్లకిందులయి అకాల వర్షాలూ భూకంపాలూ తుఫానులూ చిత్ర విచిత్రమైన రోగాలూ తయారయి తన్నిమిత్తంగా సామాన్య ప్రజానీక మెంత అలజడి పాలవుతున్నారో నిష్కారణంగా ఎంతోమంది శిశు బాల వృద్ధ జనమెంత అకాలమృత్యువు దాడి కాహుతి అయి పోతున్నారో ఆలోచించండి. ఇది జగత్తు కహితంగాక హితమా.

కామ మాశ్రిత్య దుష్పూరం- దంభ మాన మదాన్వితాః
మోహా ద్గృహీత్వా సద్రాహాన్ - ప్రవర్తంతే ఽ_ శుచివ్రతాః - 10

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు