బుద్ధి వల్ల జన్మించినవే దైవాసుర సంపదలని. బుద్ధిలోనే గదా మంచి భావాలూ చెడ్డ భావాలూ ఉదయిస్తుంటాయి. అలాటి సదసత్తులనే బుద్ధి అనే కశ్యప ప్రజాపతి కన్న సంతానంగా పురాణాల్లో కధలుగా వర్ణిస్తూ వచ్చారు. ఇదీ పురాణ కధా సంకేతం. దీనికి మూలం ఉపనిషత్తులలోని మంత్ర బ్రాహ్మణ వాక్యాలేనని మనకిప్పుడర్ధ మవుతున్నది. ఇంతకూ దైవాసుర సంపదలంటే ఇవి.
ఇందులో దైవో విస్తరశః ప్రోక్తః - దైవ సంపద సవిస్తరంగా వర్ణించాము. ఆసురం శృణు. ఇక రెండవదైన అసుర సంపదను వర్ణిస్తున్నాను వినమంటాడు. వర్ణించాడు గదా ఇంతకు ముందే అసుర సంపదను కూడా. ఇక క్రొత్తగా వర్ణించటాని కేముంది అని అడగవచ్చు. వాస్తవమే. వర్ణితపూర్వమే అది కూడా. కాని దైవ సంపద లాగా సాంగోపాంగంగా చెప్పలేదది. కేవలం సూత్రప్రాయంగా చెప్పి ముగించాడు. ఇక్కడ అలాకాక పూర్తిగా దాన్ని వివరించబోతాడు. సూత్రప్రాయంగా చెబితే చాలదా అంటారేమో. అలా చెబితే ఒక ప్రమాదముంది. అసుర సంపద ఈ వర్ణించింది మాత్రమే. ఇక మిగిలిపోయిన దేదైనా అది దైవ సంపదేనని బోల్తా పడవచ్చు సాధకుడు. అలాకాక అది ఎంత ఉన్నదో అంతా ఏకరువు పెడితే ఇక అలాటి భ్రాంతి కవకాశముండదు.
అంతేకాదు. మంచి ఎప్పుడూ తక్కువ లోకంలో. చెడ్డకే ఎక్కువ వ్యాప్తి. బాహుళ్యం. అందుకే దైవ సంపదతో పోలిస్తే అసుర సంపద చాలా