ప్రయత్నమంతా తనదేనని గ్రహించాలర్జునుడు. గ్రహించాడా. అలాటి ప్రయత్నమేమైనా సాగించాడా. ఫలిత మందుకొన్నాడా. వట్టిది. వట్టిది గాక గట్టిదే అయితే అంత భగవద్గీత విని యుద్ధానంతర మదంతా మరచి పోయాను మళ్లీ చెబుతావా అని ఎలా అడుగుతాడు. అదైనా వినటం వరకే గాని కనటం వరకూ రాలేదే ఆబుద్ధి. వస్తే ఇంద్ర సాయుజ్యం గాక బ్రహ్మ సాయుజ్యమే పొందేవాడు గదా. కాబట్టి మాట గాదు. చేత ముఖ్యం దేని కైనా. ఇది అర్జునుడు నెపంగా మనబోటి మానవాళికంతా చేస్తున్న బోధ భగవానుడు. ఏమని. మీరు అసుర సంపదతో జన్మించారో. ఎంతో కష్టపడైనా దాన్ని దైవ సంపదగా మార్చుకోటానికి ప్రయత్నించాలి. దైవ సంపద సాధించారో. అప్పటికీ గొప్పగా భావించకండి. అది శ్రవణ మననాదులతో అభివృద్ధి చేసుకొని చివరకు నిదిధ్యాసన ఏమరకుండా నిరంతరాత్మ దర్శనంతో జీవన్ముక్తిని సాధించి దేహపాతానంతరం విదేహ ముక్తిని పొందటానికి ప్రయత్నించండి. అలా కాకుంటే ఇదైనా అదైనా రెండూ విఫలమే సుమా అని ఒక బ్రహ్మాండమైన ఆంతర్యముంది ఇందులో. ఇదంతా మనసులో పెట్టుకొనే భగవత్పాదులు భావికల్యాణోసి భావికళ్యాణః అని మాటి మాటికీ వ్రాస్తున్నారు భాష్యంలో. కళ్యాణమంటే శుభం శ్రేయస్సు మోక్షం. అది దైవ సంపన్నుడి కప్పుడే వచ్చి ఒళ్లో పడదు. అది భావి భవిష్యత్తులో కలిగే ఫలితం. అదైనా శ్రవణ మననాదులు చేసి సాధించినప్పుడే సుమా అని ఆ మాటలోని నిగూఢమైన అభిప్రాయం.
Page 292