ఆత్మజ్ఞానం. అది ఉదయిస్తే దైవసంపదనంతా అదే పట్టుకు వచ్చి మనకందిస్తుది. అది కరువైతే అసుర సంపద అలాగే పొంచి ఉంటుంది మనలను కబళించటానికి. వెలుగు నీడల లాంటివి రెండూ. వెలుగుంటే చీకటి లేదు. చీకట్లో ఉంటే వెలుగు లేదు. మొత్తం మీద వెలుగు నీడల లాంటి రెండు సంపదలూ బయట పెట్టాడు మహర్షి. బయటపెట్టి ఇప్పుడా రెండూ మనకు చేసే మేలేమిటో కీడేమిటో పేర్కొంటూన్నాడు. దైవ సంపద వల్ల మేలైతే అసుర సంపద వల్ల అంతా కీడే జీవితానికి. ఎలాగంటే.
దైవీ సంప ద్విమోక్షాయ నిబంధాయా ఽ సురీమతా
మాశుచః సంపదం దైవీ- మభిజాతోసి పాండవ - 5
దైవీ సంప ద్విమోక్షాయ. దైవ సంపద నిన్ను సంసార బంధంలో నుంచి బయట పడేస్తుంది. ఎటు వచ్చీ అలాటి సంపదతో నీవు జన్మించి ఉండాలి మొదట. కాని అది కేవలం జన్మ వరకే. అంత మాత్రంతో సరిపోదు. ఒక నిప్పురవ్వలాగా అది ఏర్పడితే అక్కడి కాగక దాన్ని ప్రయత్న పూర్వకంగా ప్రజ్వలింప జేసుకోవాలి. అదే గురూప సదనం. శ్రవణ మనన ధ్యానాదికమైన అభ్యాసం. శ్రవణం చేసి విషయం తెలుసుకోవాలి. మననం చేసి సందేహాలు పోగొట్టుకోవాలి. దానివల్ల కలిగిన నిశ్చయ జ్ఞానంతో ఆత్మ తత్త్వాన్ని నిరంతరం ధ్యానిస్తూ పోవాలి. అదే సర్వత్ర దర్శిస్తూ సర్వమూ తదాకారంగానే సమన్వయించుకొంటూ పోవటమే అద్వైత ధ్యానం.