మారకుంటే స్మృతి ఏర్పడుతుందా. కనుక దృష్టాంతాన్ని బట్టి చూచినా ఒప్పుకోవాలి మనం జన్మాంతరం. ఆయా విషయాలలో ఆయా వ్యక్తులకు ఆసక్తి ప్రవృత్తి ఏర్పడటం చూస్తుంటాము. అది కూడా జన్మాంతర సంస్కార ప్రభావమే. అంచేత ఏదైనా జన్మతః వచ్చిందే. దీనికే నిసర్గమని పేరు. అది మరలా జీవితంలో మన ప్రయత్నవశాత్తూ వికసిస్తూ పోతే దానికి ప్రయత్నమని అభ్యాసమనీ సాధన అని పేరు. అది దైవ సంపదలోనైనా అసుర సంపదలో నైనా దేనిలోనైనా సూత్రమొకటే.
ప్రస్తుత మీ అసుర సంపదకు చెందిన గుణాలను గదా పేర్కొంటున్నారు. ఇందులో దంభ మంటే ధర్మ ధ్వజిత్వం నేను ధార్మికుణ్ణని జెండా ఎగరేయటం. వాస్తవంలో ధార్మికత్వం లేదు వాడిలో. పైకి నలుగురూ మెచ్చుకోవాలని చేసే ప్రదర్శన. ఇది ఒక దుర్గుణం. పోతే దర్పం. విద్యా ధన స్వజన నిమిత్తంగా కలిగే ఉత్సేకం. అంటే పొంగు. నాకింత జ్ఞానముంది. ఇంత ధన ధాన్య సంపత్తి ఉంది. ఇంతమందీ మార్బల ముందని అదీ ఇదీ చూచుకొని పొంగిపోవటం. అది ఎప్పటికైనా దెబ్బ తీస్తుంది. అప్పుడెంత వాపోయినా ప్రయోజనం లేదు. అందుకే హెచ్చరించారు మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషః కాలస్సర్వమని భగవత్పాదులు. ఇది ఈనాటి రాజకీయ వాదులకూ వ్యాపారస్థులకూ కోటీశ్వరులకూ అందిరికీ చేసిన హెచ్చరిక. ఎవరికి