ఇంకా చాలా దూరం పోయి వ్యాఖ్యానించారు భగవత్పాదులు. ఇది మనకు జడ భరతుడి విషయంలో మాండవ్య మహర్షి విషయంలో తార్కాణ మవుతుంది. అలా ఉండటం కష్టమే. కాని ప్రారబ్ధవశాత్తూ అలాంటి పరిస్థితి ఏర్పడితే బ్రహ్మవేత్త అయిన వాడు దానితో రాజీ పడక తప్పదని అర్థం చేసుకోవాలి మనం.
పోతే త్యాగం. సన్న్యాసమని అర్థం వ్రాస్తారు భాష్యకారులు. అదేమంటే ఇంతకుముందు దానమనే గుణం పేర్కొన్నారు గదా. అంచేత ఇక్కడ సన్న్యాసమనే అర్థం చెప్పాలంటారాయన. సన్న్యాసమంటే వదులుకోటమని అర్థం. కాషాయాలే కట్టనక్కర లేదు. గృహస్థుడైనా జిజ్ఞాసువైన వ్యక్తి స్వార్ధ బుద్ధి నంత కంతకు మానుకోగలిగి ఉండాలి. అలాగే శాంతి అనే గుణం అలవరుచుకోవాలి. ఇంతకు ముందు దమమనే మాటలో దాంతి అనేది కలిసి వచ్చింది. అది బహిరింద్రియ నిగ్రహమైతే ఇది అంతరింద్రియ నిగ్రహమీ శాంతి లేదా శమమనేది. అలాగే అపైశునం. పైశునమంటే పిశున స్వభావం. పరస్మై పరరంధ్ర ప్రకటీకరణమని అర్థం చెబుతున్నారు స్వామివారు. ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పటం. ఉన్నా లేకపోయినా వాడిలో దోషాలు వెతికి ఇతరుల దగ్గర అవి బయటపెట్టటం. అలాటి స్వభావం లేకుండా పోతే అది అపైశునం. దయాభూతేషు. తోడి జీవి కష్టపడుతుంటే అయ్యో అని సానుభూతి చూపటం దయ. అది మానవులే కావచ్చు. పశుపక్ష్యాదులే కావచ్చు. భూతమంటే ప్రాణులన్నీ