ఇదీ దమమంటే. దమమైన తరువాత యజ్ఞమనే గుణం. కేవలం శ్రోత స్మార్తాదులైన క్రియలే గాదు. అలాటి జీవితమే ఒక పవిత్రమైన యజ్ఞగా భావించాలని అంతరార్థం. స్వాధ్యాయ స్తప అర్జువమని మరి మూడు గుణాలున్నాయి. స్వాధ్యాయమంటే శాస్త్రాధ్యయనం. ఎప్పుడూ వేదాంత గ్రంధాలు చదువుకొంటూ ఉండటం. తపస్సంటే ఆ భావాలనే మనసులో తపిస్తూ లేదా మననం చేస్తూ కూచోటం. ఆర్జవమంటే ఋజుత్వం. నిజాయితీ. అలాటి గొప్ప భావాలకే కట్టుబడి ఉండటం. ఇప్పుడీ మూడూ మనోవాక్కాయాలనే త్రికరణాలకూ వర్తించే గుణాలు. స్వాధ్యాయం వాక్కుకూ తపస్సు మనస్సుకూ ఆర్జవం శరీరానికీ. అంటే అప్పటికి త్రికరణ శుద్ధిగా బ్రతకాలి తాను జ్ఞాని అయినందుకు మానవుడు.
పోతే ఇక అహింస. హింస కాని దహింస. హింస అంటే ప్రాణులకు పీడ లేదా కీడు చేయటం. అన్నిటికన్నా దరిద్రమైనదీ దారుణమైనదీ హింస. అలాటి హింస చేసే దుర్గుణం సాధకుడికి పనికిరాదు ఉంటే వాడు సాధకుడే కాదు. అసలు లౌకికుడే కాదా మాటకు వస్తే. ఆత్మౌ పమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున - సుఖంవాయదివా దుఃఖం నీతో పోల్చుకొని చూడాలి నీతో పాటు బ్రతికే ఏ ప్రాణిని గానీ. సుఖంగాని దుఃఖం గాని నీకెలాగో వాటికీ అలాగే గదా అని భావించాలి. అని ఇంతకు పూర్వమే చాటి చెప్పాడు మహర్షి ఒరు లేయవి యొనరించిన నర వర య ప్రియము నీమనంబున కగు తా నొరుల కవి సేయకునికియె పరాయణము