#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

జ్ఞానమంటే ఇక్కడ శాస్త్రం ద్వారా ఆచార్యుని ద్వారా ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో వాటి స్వరూపాన్ని యధాతధంగా గుర్తించటం. అలా గ్రహించటమే గాక గ్రహించిన సత్యాన్ని ఇంద్రియ చాపల్యాన్ని కట్టిపెట్టి ఏకాగ్రతతో స్వానుభవానికి తెచ్చుకోటం యోగమనే మాటకర్థమిక్కడ.

  ఇలా పరోక్షా పరోక్ష జ్ఞానంలో నిలదొక్కుకొని ఉండటమే వ్యవస్థితి. జ్ఞాన నిష్ఠ. ఇది అన్ని దైవ గుణాలలో అతి ముఖ్యమైన సాత్త్విక సంపత్తి అని పేర్కొంటారు భాష్యకారులు. అంతే కాదు. ఇందులో అధికృతులైన వారికే ప్రకృతి ఉంటుందో అదంతా సాత్త్వికమైన ప్రకృతేనని కూడా చెబుతారు.

  పోతే దానం దమశ్చయజ్ఞశ్చ. ఇలాటి జ్ఞాన నిష్ఠతో జీవితం గడిపే మహానుభావు డెప్పటికీ లోభ పడడు. అన్నీ తన దగ్గరే ఉంచుకోవాలనే స్వార్ధ బుద్ధి ఉండదు వాడికి. ఎందుకంటే సర్వమూ ఆత్మాకారంగా దర్శిస్తుంటాడు వాడు. కనుక యధాశక్తిగా తన దగ్గర ఉన్న అన్నవస్త్రాదులను గాని ధనధాన్యాదులను గాని ఇతరులకు దానం చేయాలనే చూస్తాడు. అడిగిన వారి కంతో ఇంతో పంచి పెడతాడు. దానికి దమమనేది ఉండాలి. దమమంటే బాహ్యకరణానా ముపశమః అని అర్థం వ్రాస్తారు భాష్యకారులు. అంతః కరణోపశమం దమం కాదు శమం. అది తరువాత చెప్పబోతుంది గీత. అంటే ఒకరికిచ్చే టప్పుడు మాటా చేతా వెనక్కు తీసుకోగూడదు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు